భాగ్యనగరంలో ఎవరి బలం ఎంత?
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలు ఇంకా ఏడాది గడువు మాత్రమే ఉంది.
తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికలు ఇంకా ఏడాది గడువు మాత్రమే ఉంది. అయితే ఏ ఎన్నికల్లో అయినా జంట నగరాల్లో ఎవరికి ఆధిక్యత వస్తే వారిదే అధికారానికి చేరువగా ఉంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ స్థానాలు అధికారంలోకి వచ్చేందుకు క్రియాశీలకంగా మారనున్నాయి. మిగిలిన జిల్లాలు ఒక ఎత్తు. జంటనగరాలు ఒక ఎత్తు. ఇక్కడ అన్ని రకాల ప్రజలు ఉన్నారు. పేద, మధ్య, ధనిక వర్గాలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివాసముంటున్నారు.
ఇక్కడ ఎవరు గెలిస్తే...
వీరు ఆశీర్వదిస్తేనే అధికారంలోకి దగ్గరగా రాగలరు. ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఎంఐఎం ఖాతాల్లో పడుతూ వస్తున్నాయి. అందులో గోషామహల్ మినహాయిస్తే మలక్‌పేట్, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహుదూర్‌పుర లలో ఎంఐఎం గెలుచుకునే అవకాశాలే ఎక్కువ. అక్కడక్కడ బీజేపీ కొంత పోటీ ఇస్తుంది కాని టీఆర్ఎస్ పోటీలో ఉన్నప్పటికీ నామమాత్రమేనన్నది అందరికీ తెలిసిందే. గోషామహల్ మాత్రం గతంలో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ గెలిచింది. ఎంఐఎం అక్కడ గట్టిపోటీ ఇస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీకి పట్టు లేదు.
పద్దెనిమిది నియోజకవర్గాల్లో....
ఇక సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని నాంపల్లిలోనూ ఎంఐఎం హవా కనిపిస్తుంది. అక్కడ కూడా వేరే పార్టీకి అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఏడు నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన పద్దెనిమిది నియోజకవర్గాలలో ఇతర పార్టీలు పంచుకోవాల్సి వస్తుంది. ఎంఐఎం అధికార టీఆర్ఎస్ కు పరోక్షంగా మద్దతుదారుగా ఉంది. ఇక ఈ పద్దెనిమిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు పంచుకోవాల్సి వస్తుంది. అయితే ఈ నియోజకవర్గాల్లో సెటిలర్లు కూడా కీలకంగా ఉన్నారు. పార్టీలు అందరినీ మంచి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. శివారు ప్రాంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు కొంత పట్టుంది.
టీఆర్‌ఎస్, బీజేపీ...
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ అత్యధికంగా వార్డులు గెలుచుకోవడం కొంత ఆ పార్టీకి మద్దతు దొరికిందని అనుకోవాలి. అలాగే నగరాభివృద్ధి విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కృషిని కూడా నగరవాసులు మరిచిపోవడం లేదు. ఫ్లై ఓవర్ నిర్మాణం కావచ్చు. మెట్రో రైలు విస్తరణ కావచ్చు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడంలో కావచ్చు. పరిశ్రమల స్థాపన విషయంలో కావచ్చు. అన్నింటిపైనా టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. బీజేపీ అజెండాయే వేరు. ఇక కాంగ్రెస్ మాత్రం నగరంలో బలోపేతం అయ్యేందుకు ఇప్పటి వరకూ చేసిన కృషి ఏమీ లేదనే చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే దానిని తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ కూడా నగరంలో బలోపేతమయితే పద్దెనిమిది నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముంది.