కాంగ్రెస్ కు నేతలే శాపమా?

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన దగ్గర నుంచి పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.;

Update: 2021-12-28 04:55 GMT

కాంగ్రెస్ పార్టీని ఇక తెలంగాణ లో ఎవరూ కాపాడలేరనేపిస్తుంది. కొంచెం ఊపు వస్తుందనుకుంటున్న సమయంలో వెనక్కు లాగే వాళ్లు ఎక్కువయ్యారు. ఆ పార్టీలో అది సహజమే అయినా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతే కష్టమే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైన దగ్గర నుంచి పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

కొన్ని నిర్ణయాలు...
నిజమే.. కొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అందరితో చర్చించి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ లో ఇందుకోసం ఒక కమిటీని నియమించారు. ఈ జంబో కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకునే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే కొన్ని నిర్ణయాలను రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకుంటున్నారని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. కానీ దీనికి మిగిలిన నేతలు అంగీకరించడం లేదు.
పార్టీ అధికారంలోకి రావాలన్న....
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న తపన ఎవరికీ లేనట్లే కన్పిస్తుంది. ఒకవైపు అధికార పార్టీ వివిధ పథకాలు అమలు చేస్తూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతుంది. అలాగే బీజేపీ కూడా బలపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. రెండు పార్టీలను అధిగమించి ముందుకు వెళ్లాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కలహాలతో కాలక్షేపం చేస్తుంది. దీనివల్ల ప్రజల సంగతి దేముడెరుగు. ముందు పార్టీ క్యాడర్ పనిచేయాల్సిన పరిస్థితులు కన్పించడం లేదు.
ఈ దుస్థితికి...
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఈ దుస్థితి దాపురించడానికి నేతల వ్యవహారశైలి కారణమంటున్నారు. ప్రజల్లో బలం లేని నేతలు సయితం తమకు చెప్పి కార్యక్రమాలు చేయాల్సిందేనన్న షరతులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి కాదు ఎవరు పీసీసీ చీఫ్ గా ఉన్నా ఈ విభేదాలు మామూలే. కాకుంటే టీడీపీ నుంచి వచ్చి అనతి కాలంలోనే పార్టీ చీఫ్ పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో ముఖ్యనేతలంతా వ్యవహరిస్తున్నారు. జగ్గారెడ్డి పార్టీ అధినాయకత్వానికి రాసిన లేఖ కూడా ఇందులో భాగమే. మరి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎవరూ రక్షించలేరేమో.


Tags:    

Similar News