ఉత్తమ్.. మీకిది భావ్యమేనా?

తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.;

Update: 2022-12-23 04:45 GMT

తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు. ఎరగడు కూడా. ఎందుకంటే గాంధీ కుటుంబంతో ఆయనకున్న సానిహిత్యంతో పాటు కాంగ్రెస్ ఆయనకు ఇచ్చిన పదవులు ఆయన పార్టీ గడపను దాటనివ్వలేదు. ఆయన పీసీసీ చీఫ్ గా ఉండి రెండుసార్లు పార్టీ తెలంగాణలో ఓటమి పాలు కావడంతో ఆయనంతట ఆయనే పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. అంతేకాదు పదవీ కాలం కూడా పూర్తికావడం, ఆయన నాయకత్వం పట్ల హైకమాండ్ కు కూడా కొంత అనుమానాలు కలగడంతో పీసీసీ చీఫ్ పదవి పోయిందని చెప్పేవాళ్లు లేకపోలేదు.

పార్టీ అధికారంలోకి రావాలనే...
ఉత్తమ్ కుమార్ రెడ్డికి వారసులు లేరు. సంపాదించుకోవాలన్న ధ్యాస లేదు. ఆయన ఆలోచనంతా తన రాజకీయ జీవితాన్ని మరికొంత కాలం కొనసాగించడమే. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవడమే ఆయన లక్ష్యంగా పనిచేశారు. ఇక 2021లో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికయినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించలేదు. రేవంత్ కు మాజీ పీసీసీ చీఫ్ గా తన సహకారాన్ని అందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నిజంగా పార్టీలో ఉత్తముడనే పేరు. ఆయనపై అనేక ఆరోపణలు రావచ్చు. ఆయన సారథ్యంలో ఎన్నికలలో పార్టీ ఓటమి పాలుకావచ్చు. కానీ ఆయన క్యారెక్టర్ ను మాత్రం ఎవరూ తప్పుపట్టలేరు.

నిర్ణయాల్లో లోపం ఉందా?
అలాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయ్యారు. పార్టీ హైకమాండ్ కూడా ఒక విధంగా ఆలోచనలోనే పడిందంటున్నారు. నమ్మకంగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిలో అసహనం వచ్చిందటే పార్టీ నిర్ణయాల్లో ఎక్కడో లోపం ఉందని గుర్తించినట్లుంది. మిగిలిన నేతల పరిస్థితి వేరు. వారు సీజనల్ పొలిటీషియన్స్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు కావాలి. పార్టీ పదవులనూ వారికే దక్కాలి. కానీ పని మాత్రం చేయరు. కనీసం తమ నియోజకవర్గంలోనైనా క్యాడర్ ను నిలుపుకునేందుకు ప్రయత్నించరు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలా కాదని, రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ అంతా బాగుండాలని కోరుకునే లీడర్ అని గాంధీభవన్ లో ప్రతి ఒక్కరూ అనే మాట.

కమిటీలు కాదా? టిక్కెట్ల ఆరాటమేనా?
కానీ సీనియర్ నేతల నుంచి వత్తిడి వల్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ లైన్ దాటారని కొందరు అనేవారు లేకపోలేదు. నిజానికి ఇప్పటికప్పుడు పీసీసీ చీఫ్ ను మార్చమని అడిగే రాజకీయ అజ్ఞాని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల వరకూ రేవంత్ మాత్రమే పీసీసీ చీఫ్. ఇది ఫిక్స్. హైకమాండ్ కూడా అదే చెబుతుంది. కాకుంటే సీనియర్లు ఇప్పుడు కమిటీల్లో స్థానం కంటే రేపు ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుపైనే వారు ఎక్కువగా కంగారు పడుతున్నారు. తమ వర్గానికి చెందిన వారికి టిక్కెట్లు దక్కవన్న ఆందోళనే సేవ్ కాంగ్రెస్ వైపు మళ్లించిందంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే ఆలోచనతో అసమ్మతి వర్గంలో చేరిపోయారంటున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టీ కప్పులో తుపానులా ఇది మారుతుందా? లేక కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదురుతుందా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News