ఈసారి టిక్కెట్ల కేటాయింపు బాబు చేతుల్లో లేదట

తెలుగుదేశం పార్టీ ఈసారి టిక్కెట్ల కేటాయింపులో ఎన్నడూ లేని కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు;

Update: 2021-12-20 08:00 GMT

తెలుగుదేశం పార్టీ ఈసారి టిక్కెట్ల కేటాయింపులో ఎన్నడూ లేని కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. చంద్రబాబు చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చి దాదాపు మూడు దశాబ్బాలవుతుంది. రెండుసార్లు అధికారంలోకి పార్టీని తీసుకువచ్చారు. పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు కావడంతో ఆ పార్టీకి నేతల కొరత పెద్దగా ఉండదు. క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎంపిక చేసిన వారికే టిక్కెట్ల కేటాయింపు జరుగుతూ వస్తోంది.

ఐదు ఎన్నికల్లో...
1999, 2004, 2009, 2014, 2019 లో జరిగిన ఐదు ఎన్నికల్లోనూ చంద్రబాబు తన సొంత అంచనాతోనే అభ్యర్థులను నిర్ణయించారు. 1999 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లోనూ బాబు టిక్ పెట్టిన వారికే టిక్కెట్లు దక్కాయి. ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన పని ఆయనకు దొరకలేదు. ఎందుకంటే నేతలందరూ పుష్కలంగా ఉండటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, విభజన ఆంధ్రప్రదేశ్ లోనూ ఆయన మాటే ఫైనల్. ఆయన అనుకున్నవారే అభ్యర్థులయ్యారు. కొత్త వారికి స్వల్పంగా అవకాశాలు కల్పించినా బలమైన నేతలను చూసి అభ్యర్థులుగా ఎంపిక చేసేవారు. పేరుకు స్క్రీనింగ్ కమిటీల వంటివి వేసినా అది నామమాత్రమే. చంద్రబాబు అనుకున్న వారికే టిక్కెట్ లభించేది.
ఓటమి ఎదురయినా...?
ప్రాంతీయ పార్టీ కావడంతో అధినేతకు ఆ వెసులు బాటు ఉంటుంది. దానినే చంద్రబాబు ఉపయోగించుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ వచ్చేవారు. కొన్నిసార్లు ఓటమి ఎదురయినా కొన్ని సార్లు విజయం వైపు నడిపించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. కానీ 2019 ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీకి దశాబ్దకాలంగా వెన్నంటి ఉన్న వర్గాలు సయితం పక్కకు వెళ్లిపోయాయి.
ఈసారి అలా కాదట....
దీంతో పాత నాయకత్వాన్ని నమ్ముకుంటే 2024 ఎన్నికల్లోనూ ఇబ్బందులు తప్పవని చంద్రబాబు గ్రహించారు. తనకు తెలిసిన నేతలకంటే ప్రజలు కోరుకుంటున్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈసారి అందులో రాజీపడే ప్రసక్తి లేదని అంటున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయిస్తున్నారు. రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక సర్వే కొనసాగుతుండగా, మరో రెండు పేరు మోసిన సంస్థలకు కూడా సర్వే బాధ్యతలను చంద్రబాబు అప్పగించారని తెలిసింది. వారు ఎన్నికలు పూర్తయ్యే లోపు మూడు దఫాలు సర్వేలు చేసి నివేదికలు ఇవ్వాలంటున్నారు. అంటే ఏడాదికి ఒక సర్వే చేస్తారు. ఈ సర్వే ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దీంతో టీడీపీలో నేతలకు ఇప్పటి నుంచే భయం మొదలయింది.



Tags:    

Similar News