ఢిల్లీలో ఆ వాసనే లేదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు. వీలయితే బీజేపీ పెద్దలతో కలుద్దామని ఆయన భావించారు. అందుకే మరుసటి రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిజానికి ఐదోతేదీ రాత్రి జీ 20 సన్నాహక సదస్సులో భాగంగా అఖిపక్ష సమావేశం జరిగింది. ఆరోజు రాత్రికి లేకుంటే మరుసటి రోజు ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి రావచ్చు. కానీ చంద్రబాబు మాత్రం రెండోరోజు కూడా అక్కడే వేచి ఉన్నారు. బీజేపీ పెద్దల నుంచి తనకు పిలుపు వస్తుందేమోనన్న ఆశతో ఆయన ఉన్నారని తెలుస్తోంది.
తెలంగాణలో పొత్తుతో...
అయితే బీజేపీ పెద్దల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. చంద్రబాబు అంచనాలకు ఢిల్లీ పెద్దల ఆలోచనలు అందడం లేదు. తెలంగాణలో తన అవసరం ఉందని భావించి తిరిగి తనను దగ్గరకు తీసుకుంటారని చంద్రబాబు భావిస్తున్నారు. తొలుత తెలంగాణలోనే ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత ఏపీ అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసే కంటే టీడీపీతో కలసి పోటీ చేస్తే కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి పరిస్థితి అనుకూలంగా మారుతుందని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారని చంద్రబాబుకు ఉప్పందంది. టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన నేతలు కూడా కమలం పార్టీ హైకమాండ్ కు అదే నూరిశారంటున్నారు. తెలంగాణలో పొత్తు కుదుర్చుకుంటే దాదాపు ముప్ఫయి నుంచి నలభై నియోజకవర్గాల్లో బీజీపీకి తిరుగుండదని నివేదికలు కూడా ఇచ్చారట.
పిలుపు వస్తుందని...
అది భావించిన చంద్రబాబు తెలంగాణ కోసమయినా తనకు పిలుపు వస్తుందని చంద్రబాబు భావించారు. ఆశించారు కూడా. అందుకే పిలిచిన వెంటనే బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. గతంలోనూ వెళ్లి మోదీతో కరచాలనం చేసి వచ్చినప్పుడు వీలయినప్పుడు ఢిల్లీకి రమ్మని, కలుద్దాం మాట్లాడుకుందాం అని మోదీ అన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదు. జగన్ తో జరుగుతున్న యుద్ధంలో గెలవాలంటే బీజేపీ తోడు అవసరం అని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఫోన్ రాగానే హస్తినకు పరుగులు తీస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు గాంభీర్యత ఆయనలో ఇసుమంతైనా కనిపించడం లేదు. బీజేపీ తనను ఈ ఒక్కసారి ఆదరిస్తే చాలు అన్న రీతిలో ఆయన వ్యవహారం కనపడుతుంది.
ఆ ఆశతోటే....
కానీ రెండు రోజులున్నా బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. సహజంగా చంద్రబాబు ఢిల్లీ వెళుతుంటే ముందుగానే అపాయింట్‌మెంట్లు ఫిక్సవుతాయి. అలాంటి లాబీయింగ్ ను చేసే వాళ్లు ఢిల్లీలో చంద్రబాబుకు కొదవలేదు. కానీ గత రెండు దఫాలుగా ఆయన ఎవరినీ కలవకుండానే తిరిగి వస్తున్నారు. ఇక బీజేపీతో తన చెలిమి కుదిరే పని కాదన్నది చంద్రబాబుకు అర్థమయినట్లుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ 150 స్థానాలతో గెలుస్తుందని జాతీయ మీడియా ప్రతినిధులను విందుకు ఆహ్వానించి మరీ లెక్కలతో వివరించారట. జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తన సభలకు వస్తున్న జనాన్ని ఫొటోలు, వీడియోలతో ప్రదర్శించి వారిని ఆకట్టుకునేందుకు ట్రై చేసినట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాలో టీడీపీ పుంజుకుందని వార్తలు వస్తే అప్పటికైనా కమలనాధులు దిగిరాకపోతారా? అన్న ఆశకావచ్చు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఏ మేరకు విజయవంతమవుతాయో చూడాలి.