40 ఇయర్స్ పొలిటికల్ కెరీర్... 2021 బ్యాడ్ ఇయర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 2021 పొలిటికల్ కెరీర్ లో అత్యంత బ్యాడ్ అని చెప్పక తప్పదు.;

Update: 2021-12-28 07:24 GMT

2019 ఎన్నికలు చంద్రబాబును కోలుకోలేని దెబ్బతీశాయి. అయితే రెండేళ్లలో పార్టీ కోలుకుంటుందని భావించిన వారికి నిరాశే ఎదురయింది. 2021వ సంవత్సరం చంద్రబాబుకు రాజకీయంగా చుక్కలు చూపిందనే చెప్పాలి. ఒకవైపు కరోనా వైరస్ తో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి రావడం, మరోవైపు వరస ఎన్నికల్లో దారుణ ఓటమి ఆయనకు ఈ ఏడాది చేదు అనుభవాలను మిగిల్చిందనే చెప్పాలి. నలభై ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇలాంటి ఏడాదిలో జరిగిన సంఘటనలు ఎన్నడూ చూసి ఉండకపోవచ్చు. అందుకే చంద్రబాబుకు 2021 పొలిటికల్ కెరీర్ లో అత్యంత బ్యాడ్ అని చెప్పక తప్పదు.

పార్టీని చేతుల్లోకి తీసుకున్న తర్వాత...
చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎన్నడూ లేని రాజకీయ ఇబ్బందులు ఈ ఏడాది కలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి కోలుకోలేని దెబ్బతీసింది. ఒకరకంగా చెప్పాంలటే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనూ చంద్రబాబు పార్టీకి దక్కిన ఓటమితో ఆయన కూడా కుంగిపోయారు. ఇక తన సతీమణిని అసెంబ్లీలో తూలనాడారని మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. ఆయన తన జీవితంలో ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఎన్నడూ జరగలేదు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేసి మరీ వెళ్లడం ఈ ఏడాది టీడీపీలో జరిగిన ప్రధాన ఘట్టాలు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో....
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తికావడంతో కొత్త కమిషనర్ గా వచ్చిన నీలం సాహ్ని స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్, మున్సి పల్ ఎన్నికలు ఈ ఏడాది జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ ఊహించని ఫలితాలే వచ్చాయి. కేవలం 14 పంచాయతీలనే టీడీపీ దక్కించుకుంది. దీంతో పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ పెట్టాక ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. పరిషత్ ఎన్నికల్లో 90 శాతం వైసీపీ పరం కావడం విశేషం. టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించడం ఆ పార్టీ నేతలే విభేదించడం విశేషం.
ఒక్క మున్సిపాలిటీ...
ఇక మున్సిపల్ ఎన్నికల విషయానికొస్తే పూర్తిగా డీలా పడిందనే చెప్పాలి. రాష్ట్రంలో మున్సిపాలిటీలకు, కార్పరేషన్లకు ఎన్నికలు జరిగితే ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే టీడీపీకి దక్కింది. ఇక బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ చంద్రబాబు దూరంగా ఉన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పం మున్సిపాలిటీని కూడా టీడీపీ కోల్పోయింది. వరస ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమి పార్టీని పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టేశాయి.
ఢిల్లీలోనూ చుక్కెదురే....
ఇక చంద్రబాబు ఈ ఏడాది పార్టీని బలోపేతం చేద్దామనుకుంటున్న తరుణంలో కరోనా కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. చంద్రబాబు ఇంటి మీదకు వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ను బోస్ డీకే అని తిట్టినందుకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగాయి. దీనికి నిరసనగా చంద్రబాబు 36గంటల దీక్ష చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లినా ఫలితం కన్పించలేదు. అక్కడ ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ లభించలేదు. రాష్ట్రపతిని కలిసి తిరిగి రావాల్సి వచ్చింది. చంద్రబాబుకు 2021 రాజకీయంగా ఎన్నడూ లేని చేదు అనుభవాలను మిగిల్చిందనే చెప్పాలి.


Tags:    

Similar News