వైసీపీ నుంచి జంప్ చేసేది వీరేనా?

వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నంలో టీడీపీ ఉంది.

Update: 2022-06-10 03:02 GMT

వైసీపీ అధికారంలో ఉంది. సహజంగా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. మరో వైపు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి పొత్తులతోనే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. దీంతో పార్టీలో చేరే వారే సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి రాజకీయ పార్టీ చేరికల మైండ్ గేమ్ ఖచ్చితంగా ఆడుతుంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా చివరి నిమిషంలో పార్టీలో చేరే వారి జాబితాను రూపొందిస్తున్నారని సమాచారం.

అసంతృప్తిగా ఉన్న....
ముఖ్యంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నంలో టీడీపీ ఉంది. ఇందుకోసం టీడీపీలో సీనియర్ నేతలతో ఒక బృందాన్ని చంద్రబాబు నియమించారని తెలిసింది. అసంతృప్తిగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను గుర్తించి వారిని పార్టీ వైపు మళ్లించే ప్రక్రియను చేపట్టే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయిందని తెలిసింది. ఈ టాస్క్ ఫోర్స్ బృందం ఇద్దరు ఎంపీలతో సంప్రదింపులు జరుపుతుంది.
ముగ్గురు ఎంపీలు...
కోస్తాంధ్రలో ఉన్న ఇద్దరు ఎంపీలు పార్టీ మారేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇద్దరు ఎంపీలు చెరొక ప్రధాన సామాజికవర్గమే అయినా వారి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యేలతో ఘర్షణ పడుతున్నారు. ఎమ్మెల్యేలు వారిని లెక్క చేయకపోవడం, వైసీపీ అధినాయకత్వానికి చెప్పినా పట్టించుకోక పోవడంతో ఎంపీలు ఇద్దరూ చివరి నిమిషంలో టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. గత ఎన్నికల సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి మాదిరి చేయాలన్న ప్లాన్ కూడా ఉందంటున్నారు. ఎటూ రఘురామ కృష్ణరాజు ముందే పార్టీ మారతారు.
ఎమ్మెల్యేలకు కూడా...
అలాగే ఆనం రామనారాయణరెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. తనకు రెండో విడత మంత్రి వర్గ విస్తరణలోనూ స్థానం కల్పించకపోవడంపై ఆయన అక్కసుతో ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుంది. వీరితో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. వీరిని పార్టీ వైపు మళ్లించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. మొత్తం మీద ఎన్నికలు మరో ఏడాది ముందు జంపింగ్ లు వైసీపీ నుంచి ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

.


Tags:    

Similar News