ఈ స్నేహం ఫొటోలకేనా..?

తెలంగాణ కాంగ్రెస్ తిరిగి బలోపేతమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. కొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి.;

Update: 2021-11-30 07:01 GMT

తెలంగాణ కాంగ్రెస్ తిరిగి బలోపేతమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. కొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఇటీవల ఒకే వేదికపై కలవడం క్యాడర్ లో సంతోషాన్ని నింపింది. వచ్చే ఎన్నికల వరకూ ఇలాగే కొనసాగుతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నా ప్రస్తుతానికయితే ఈ స్నేహంపై కాంగ్రెస్ పార్టీలో చర్చజరుగుతుంది. ఇద్దరూ ఎంపీలే కావడంతో ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనూ కలసి నడుస్తుంటం విశేషంగా క్యాడర్ చర్చించుకుంటున్నారు.

పీసీసీ చీఫ్ గా....
పీసీసీ చీఫ్ పదవిని రేవంత్ రెడ్డికి దక్కిన నాటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్ కు దూరంగా ఉన్నారు. తాను గాంధీ భవన్ లోకి అడుగుపెట్టబోనని శపథం చేశారు. మాణికం ఠాగూర్ అమ్ముడుపోయాడని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ సంస్మరణ కార్యక్రమానికి హాజరుకావద్దని చెప్పినా కోమటిరెడ్డి హాజరై ఆయనపై ప్రశంసలు కురిపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో ఘోర ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీక్షలో....
అయితే తాజాగా వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాంగ్రెస్ చేపట్టిన రెండు రోజుల దీక్షలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రేవంత్ తో చేయికలిపారు. ఇప్పుడిప్పుడే సీనియర్ నేతలందరూ కలసి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐక్యంగా పనిచేస్తామని కింది క్యాడర్ కు సంకేతాలను పంపుతున్నారు. కానీ ఇది ఎన్నాళ్లు? ఏదైనా నిర్ణయం రేవంత్ తీసుకుంటే దానిని సమర్ధిస్తారా? అంటే అనుమానమే.
రానున్న కాలంలో....
ఇక ఎన్నికల సమయానికి వచ్చే సరికి టిక్కెట్ల గొడవ, ప్రచారం రగడ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో మామూలుగానే ఉంటాయి. సీనియర్లు తమ ఆధిపత్యాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో తమ వర్గానికి చెందిన వారిని ఇన్ ఛార్జులుగా నియమించాలని సీనియర్లు వత్తిడి తెస్తున్నారు. రానున్న కాలంలో విభేదాలు తలెత్తవన్న గ్యారంటీ అయితే ఏమీలేదు. ప్రస్తుతానికి ఈ స్నేహాన్ని, ఈ ఫొటోలను చూసి క్యాడర్ మురిసిపోతున్నారు. మరి రానున్న కాలంలో?


Tags:    

Similar News