రెడ్ల కంటే కమ్మోళ్లే బెటరట

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గంలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమంటున్నారు

Update: 2023-03-28 04:47 GMT

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతుంది. ఇప్పటి వరకూ ఎలాంటి అసంతృప్తులు చోటు చేసుకోలేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసంతృప్త నేతలు బయటపడ్డారు. మొత్తం నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ లైన్ ను థిక్కరించి ఓటు వేశారు. వారిపై పార్టీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎక్కువ మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు. నలుగురిలో ముగ్గురు రెడ్లు, ఒకరు దళిత మహిళ ఉండటంతో జగన్ సామాజికవర్గీయులే పార్టీని దెబ్బతీస్తున్నారన్న టాక్ బలంగా వినపడుతుంది.

వైసీపీ రెడ్లతో...
ఏపీ రాజకీయాల్లో కులం ఆధారంగానే పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిదని, వైసీపీ రెడ్డి కులానికి చెందిన వారిదని, జనసేన కాపు కులానికి చెందినదన్న టాక్ బహిరంగంగానే వినిపిస్తుంటుంది. వినిపించిన విధంగానే ఆ సామాజికవర్గం ఆ యా పార్టీలకు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సామాజికవర్గాల వారు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. గత ఎన్నికల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వైసీపీ వైపు చూడటంతోనే జగన్ విజయం సాధ్యమవుతుంది. రెడ్లు ఎటూ తన వెంటే ఉంటారని భావించి జగన్ మంత్రివర్గంలోనూ, వివిధ నియామకాల్లోనూ వారిని దూరంగా ఉంచారు. అది ఆ సామాజికవర్గంలో అసంతృప్తికి, అసహనానికి కారణమవుతుందన్న వార్తలు తరచూ వింటూనే ఉన్నాం.
ఆరుగురు కమ్మ ఎమ్మెల్యేలున్నా...
నిజానికి వైసీపీలో అరడజను వరకూ కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, దెందులూరు నుంచి అబ్బయ్య చౌదరి, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, పెదకూరపాడు నుంచి నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడులు ఉన్నారు. కానీ వీరెవరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదు. తమకు సీటు ఇచ్చినందుకు, ప్రాధాన్యత ఇస్తున్నందుకు నమ్మకంగానే ఉన్నారు. మంత్రివర్గంలో కొడాలి నాని తర్వాత మరొకరికి అవకాశం జగన్ కల్పించలేకపోయినప్పటికీ వారిలో అసంతృప్తి ఇసుమంతైనా కనిపించలేదు. తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీలోని కమ్మ సామాజికవర్గం నేతల జోలికి వెళ్లలేదు.
నిర్లక్ష్యం కారణంగానే...
రెడ్డి సామాజికవర్గంపైనే టీడీపీ ఫోకస్ పెట్టడం కూడా పార్టీలో ఆందోళన కలిగిస్తుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ కొంత సొంత సామాజికవర్గం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. ఎంపిక చేసుకున్న కొందరికే ఈ సామాజికవర్గంలో ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇంకెవ్వరికీ అవకాశాలు దక్కడం లేదు. తమ పార్టీగా జబ్బలు చరుచుకుని, ఛాతీ చూపిస్తూ ఎన్నికలకు ముందు వైసీపీ జెండా పట్టుకుని తిరిగిన రెడ్డి సామాజికవర్గం నేతలు ఇప్పుడు కామ్ అయిపోయారు. అందుకే పట్టభద్రుల నియోజకవర్గాల్లో పశ్చిమ, తూర్పు రాయలసీమలో రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులను పోటీకి దింపినా గెలవలేకపోయారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News