సంక్షేమం + సెంటిమెంట్ = మళ్లీ ఛాన్స్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై చేసిన విమర్శలు సెంటిమెంట్ కోసమేనా అన్న అనుమానం కలుగుతుంది;

Update: 2022-12-23 13:18 GMT

ఇదే నా రాష్ట్రం

ఇక్కడే నా నివాసం
ఇక్కడే మమకారం
ఇక్కడే రాజకీయం
ఇక్కడి ప్రజల సంతోషమే నా విధానం
ఇక్కడి ఐదు కోట్ల ప్రజలే నా కుటుంబం
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతి రాజకీయ పార్టీ సెంటిమెంట్ ను కూడా కొంత జోడిస్తుంది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క ఛాన్స్ అని జగన్ అధికారంలోకి వచ్చారు. అలాగే ఈ ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఛాన్స్ ల నినాదాలు ఇలా కొనసాగుతుండగానే ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో మరో సెంటిమెంట్ కూడా మొదలయింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో ఉండి చుట్టపు చూపుగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాజకీయం చేసి వెళుతున్నారన్న ప్రచారాన్ని వైసీపీ మొదలు పెట్టేసింది.
పన్నులు అక్కడ కడుతూ....
పవన్ కల్యాణ్ ఏపీలో తాను తిరిగే వారాహి వాహనానికి, ఆయన వెంట కాన్వాయ్ వాహనాలను కూడా తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ చేయించడాన్ని తప్పపడుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనపడుతున్నాయి. పన్నులు, ఫీజులు తెలంగాణలో కట్టి ఏపీలో రాజకీయం చేస్తామంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగపడేలా పన్నులు ఇక్కడ చెల్లించాలి కదా? అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. వీకెండ్ వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడమేంటని? అక్కడే షూటింగ్ లు చేసి ఆదాయాన్ని తెలంగాణకు పంచి పెడుతున్నారన్న విమర్శలు కూడా వైసీపీ సోషల్ మీడియా నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నిలదీస్తున్నారు.

రెండు కళ్ల సిద్ధాంతమంటూ...
ఇక చంద్రబాబు రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ పెట్టారు. తెలంగాణలోనూ టీడీపీ ఉంటుందని తెలిపారు. తెలంగాణలోనూ టీడీపీని దీవించాలని కోరారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని తెలిపారు. గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఈసారి బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి మాదిరిగా తాను రాజకీయం చేయబోనని తెలిపారు. ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ తాను అనబోనని అన్నారు. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం అని అనడం లేదన్నారు. దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని కూడా అని తాను అనడం లేదన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని పోస్టింగ్ లు కనపడుతున్నాయి.

రెండోసారి విక్టరీ కోసమేనా?
తన రాజకీయం ఇక్కడేనని తెలిపారు. వైసీపీ ఒక్కటే పోటీ చేస్తుందని పరోక్షంగా చెప్పారు. ఏపీ లోనే తన పాలిటిక్స్ కొనసాగుతాయని తెలిపారు. తాను రాష్ట్రం వదిలి వెళ్లబోనని, ఇక్కడే ఉండి ప్రజా సమస్యల కోసం ఉంటానని జగన్ చెప్పారు. జగన్ ఈ రకమైన సెంటిమెంట్ ను ప్రజల్లోకి పంపే ప్రయత్నంలో ఉన్నారని కనిపిస్తుంది. వారిద్దరి మాదిరి హైదరాబాద్ లో ఉండనని, అక్కడ నివాసం ఉండనని కూడా చెప్పారు. ఇలా సెంటిమెంట్ తో జగన్ మరోసారి ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. సంక్షేమం + సెంటిమెంట్ కలిపితేనే విజయం రెండోసారి గ్యారంటీ అని నమ్ముతున్నారేమో.. రానున్న రోజుల్లో ఇంకెన్ని పంచ్ డైలాగులు ఏపీ పొలిటీషియన్స్ నుంచి వినాల్సి వస్తుందో చూడాలి.


Tags:    

Similar News