మిషన్ "కాపు" మొదలు పెట్టేశారా?

ఈసారి సీమలో బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ భావిస్తుంది. వారికి ఎక్కువ సీట్లను కేటాయించే అవకాశాలున్నాయి;

Update: 2023-01-01 03:59 GMT

రాయలసీమలో వైసీపీకి పట్టుంది. గత ఎన్నికల్లో రాయలసీమ నాలుగు జిల్లాల్లో టీడీపీకి కేవలం మూడు సీట్లు మాత్రమే వచ్చాయి. అందులో అనంతపురంలో బాలకృష్ణ హిందూపురం, పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలిచారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి ఒక్క చంద్రబాబు మాత్రమే గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు చేసిందేమీ లేదన్న విమర్శలు టీడీపీ చేస్తుంది. సీమలో నిలదొక్కుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు రాయలసీమలో అత్యధికంగా ఉన్న బలిజలను తమ వైపునుకు తిప్పుకునేందుకు పవన్ కల్యాణ‌్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.


అలర్టయిన వైసీపీ...

ఈ నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయింది. రాష్ట్రంలో కాపులు ఏకమయ్యే పరిస్థితి నెలకొంది. కాపు రిజర్వేషన్లు కూడా వచ్చే ఎన్నికల్లో పెద్ద సమస్యగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేయడంతో కాపులు రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల కోసం నిరవధిక దీక్షకు దిగుతున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం ఇప్టటికే ముఖ్యమంత్రి జగన్ కు రెండు లేఖలు రాశాయి. కాపులు జనసేన, టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ కూడా అలర్ట్ అయింది.
సీమలో ఎక్కువగా...
రాయలసీమలో ఎక్కువ మంది బలిజలున్నారు. కాపు, బలిజ, ఒంటరి వంటి వర్గాలన్నీ కలసి ఏకమయితే కొంత రాజకీయంగా వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అందుకే ఈసారి సీమలో బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ భావిస్తుంది. కోస్తాలోనే కాపులు ఎక్కువగా ఉన్నారు. వారిదే ఎక్కువగా ఆధిప్యతం కనపడుతుంది. ఎక్కువ పదవులు కూడా కాపుల కోటాలో వారు తీసుకుంటున్నారు. మరి బలిజల పరిస్థిితి ఏంటన్న ప్రశ్న తలెత్తుంది. గత ఎన్నికల్లో సీమలో ఒక్క బలిజకు కూడా జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. గతంలో ఎన్టీఆర్ సమయంలో సీమలో పది మంది బలిజలకు టిక్కెట్లు ఇచ్చారు. సి. రామచంద్రయ్య వంటి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా బలిజ కోటా కావాలనేది వారి ప్రధాన డిమాండ్ గా వినిపిస్తుంది.

ఈ మూడు చోట్ల...
రాజంపేట టిక్కెట్ బలిజలకే కేటాయిస్తూ వస్తుంది. అలాగే తిరుపతి, చిత్తూరు, రాజంపేట, అనంతపురం వంటి చోట్ల బలిజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కానీ వైసీపీ ఈసారి బలిజలకు టిక్కెట్లు కేటాయించాలని భావిస్తుంది. తద్వారా సీమలో బలిజ ఓట్లను సాధించడం సులువవుతుందని భావిస్తుంది. ప్రధానంగా తిరుపతి, అనంతపురం అర్బన్, రాజంపేట నియోజకవర్గాల నుంచి ఈసారి బలిజలను పోటీ చేయించే అవకాశాలున్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైసీపీ నుంచి రెడ్లే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాపుల నుంచి బలిజలను వేరు చేయాలంటే అధిక సీట్లు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారు. సీమలో సీట్లు తగ్గితే అధికారానికి దూరమవుతామన్న ఆందోళనే బలిజలను దగ్గరకు తీసుకోవాలన్న కొత్త ఎత్తుగడకు వైసీపీ దిగనున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఎంతమంది బలిజలకు సీట్లు ఇస్తే అంతమంది సిట్టింగ్ లు తమ స్థానాలను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News