వైసీపీలో ఇక పండగే పండగ
ఈ ఏడాది వైసీపీ నేతలకు పండగే. వరసగా పదవులు వారిని వరించబోతున్నాయి. 23 ఎమ్మెల్సీ పోస్టులు ఈ ఏడాది ఖాళీ అవుతున్నాయి.;
2023 సంవత్సరం వైసీపీ నేతలకు పండగే. ఎందుకంటే వరసగా పదవులు వారిని వరించబోతున్నాయి. ఈ ఏడాది వైసీీపీకి పదవుల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 23 ఎమ్మెల్సీ పోస్టులు ఈ ఏడాది ఖాళీ అవుతున్నాయి. వాటిలో సింహభాగం వైసీపీ నేతలకే దక్కనున్నాయి. దీంతో వైసీపీ నేతల్లో జోష్ పెరిగింది. ఇందుకు కారణమూ లేకపోలేదు. 2023 లో ఎమ్మెల్సీగా ఎన్నికయితే 2029 వరకూ పదవిలో కొనసాగే వీలుంది. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడినా, గెలిచినా తమకు వచ్చే నష్టమేమీ లేదు. తమ పదవీకాలం పూర్తయ్యే సమయానికి మళ్లీ 2029 ఎన్నికలు వచ్చేస్తాయి.
23 ఎమ్మెల్సీ పోస్టులు...
అందుకే ఈ పోస్టులన్నింటికీ యమ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యమంత్రి జగన్ ను నేరుగా కలుసుకోలేకపోతున్న నేతలు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలను కలసి తమ గోడును నేతలు వెళ్లబోసుకుంటున్నారు. తమ బయోడేటాలను ఇస్తున్నారు. అయితే ఫైనల్ గా జగన్ నిర్ణయంపైనే ఆధారపడి పదవుల నియామకం జరుగుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువు ఉండటంతో జగన్ కూడా సామాజికవర్గాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
18 ఖచ్చితంగా వైసీపీకే...
ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా, స్థానికసంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు విభాగాల్లో వైసీపీకి డోకా లేదు. శాససభలో ఎటూ వైసీపీదే ఆధిపత్యం కాబట్టి ఎమ్మెల్యేల కోటాలో భర్తీ కానున్న ఏడు ఎమ్మెల్సీల స్థానాలు వైసీపీకే ఖచ్చితంగా దక్కనున్నాయి. ఇక గవర్నర్ కోటాలో రెండు స్థానాలు భర్తీ అవ్వాల్సి ఉంది. ఈ రెండు కూడా వైసీపీ ఖాతాలోకేనని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక స్థానిక సంస్థల కోటా కింద తొమ్మిది స్థానాలు ఫిలప్ కావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో వైసీపీ పూర్తి స్థాయి మెజారిటీ ఉంది కాబట్టి తొమ్మిది కూడా వైసీపీ నేతలకే దక్కనున్నాయి. అంటే 18 ఎమ్మెల్సీ పోస్టులు ఈ ఏడాది వైసీపీకి దక్కనున్నాయి. ఇక గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో మాత్రం పోటీ జరుగుతుంది. అక్కడ పోటీ తప్పదు. ఆ ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది.
ఎక్కువ టీడీపీవే...
ఈ ఏడాది మార్చి నాటికి 14, మే నాటికి ఏడు, జులై నాటికి రెండు ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అవుతున్నాయి. గవర్నర్ కోటాలో ఉన్న చడిపిరాళ్ల శివనాధరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ పదవీ విరమణ చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా కింది గంగుల ప్రభాకర్ రెడ్డి, డొక్కా మాణిక్యవర ప్రసాద్, పీవీవీ సూర్యనారాయణ రాజు, పోతుల సునీత, చల్లా భగీరధ రెడ్డి, నారా లోకేష్, బచ్చుల అర్జునుడు ఉన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి బీటెక్ రవి, దీపక్ రెడ్డి, బీఎన్ రాజనరసింహులు, అంగర రామ్మోహన్, ఎంవీ సత్యనారాయణ రాజు, చిక్కాల రామచంద్రారావు, శత్రుచర్ల విజయరామరాజు, కేఈ ప్రభాకర్, వాకాటి నారాయణ రెడ్డిలు ఉన్నారు. వీరిలో వాకాటి నారాయణరెడ్డి మినహా అన్నీ టీడీపీకి చెందిన వారే.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని...
అయితే ఈసారి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొందరికి అవకాశం దక్కకపోవచ్చు. ప్రధానంగా డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటివారికి వచ్చేఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే ఆలోచన ఉంటే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వరు. చల్లా భగీరధ రెడ్డి కుటుంబానికి ఇస్తే ఇవ్వొచ్చు. లేకుంటే లేదు. కడప, అనంతపురం, చిత్తూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు నేతలకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశముంది. అయితే ఎవరు అదృష్టవంతులనేది త్వరలోనే తేల్చనున్నారు. ఎమ్మెల్సీ పదవులు భారీసంఖ్యలో ఈ ఏడాది భర్తీ కానుండటంతో వైసీపీ నేతలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఇందులో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాలకు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది.