ముగ్గురూ ఇటే వస్తారట...అందుకే ఆ ప్రయత్నాలు

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది నేతల ఆలోచనలు మారుతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయాలని భావిస్తున్నారు;

Update: 2022-01-30 07:38 GMT

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడే కొద్ది నేతల ఆలోచనలు మారుతున్నాయి. అధికార పార్టీపై నెలకొన్న అసంతృప్తి ఈసారి ఖచ్చితంగా తమకు పవర్ తెచ్చిపెడుతుందన్న ఆశతో ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్, బీజేపీలు తమదే అధికారం అన్నట్లు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమ పార్టీకి అనుకూలంగా మారుతుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యుల కన్ను అసెంబ్లీ సీట్లపై పడింది.

కొడంగల్ నుంచి....
గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన వీరు తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరు. ఆయన కొడంగల్ నియోజకవర్గం తనను ఆదరిస్తుందని, మరోసారి పోటీ చేస్తామని చెబుతున్నారు. అంటే పార్లమెంటు ఎన్నికలకు ముందు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రేవంత్ రెడ్డి సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.
హుజూర్ నగర్ కు...
ఇక మాజీ పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సయితం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించాలని ఆయన భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి మరోసారి పోటీ చేస్తారంటున్నారు. అందుకే ఆయన తరచూ హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో జూమ్ మీటింగ్ లో టచ్ లో ఉన్నారు. ఆయన సతీమణి పద్మావతికి ఈసారి కోదాడ టిక్కెట్ ఇవ్వకపోయినా తాను మాత్రం హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు.
నల్లగొండ నుంచే మళ్లీ.....
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు రాష్ట్ర రాజకీయాలంటేనే మక్కువ. నల్లగొండలో ఈసారి తన గెలుపు గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. అందుకే ఆయన ఎక్కువగా నల్లగొండ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. క్యాడర్ తో టచ్ లో ఉన్నారు. ఆయన కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ముగ్గురు నేతలు ముఖ్యమైన పదవిపైనే కన్నేసి తిరిగి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వీరి ఆలోచనకు పార్టీ హైకమాండ్ ఏ రకంగా స్పందిస్తుందా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News