బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్.. 35 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు

ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు. తండ్రి

Update: 2022-02-01 05:42 GMT

బ్రహ్మానందం.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు వింటే చాలు.. పెదాలపై చిరునవ్వు వస్తుంది. ఇక ఆయన కామెడీ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే. కొన్నేళ్లుగా సినీ ప్రపంచంలో రాణిస్తూ.. తనకంటే ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న కన్నెగంటి బ్రహ్మానందం.. నేడు 66వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు ఈ నవ్వుల నవాబు.

ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం వచ్చి, అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. ఆయనకు వాళ్ల నాన్నగారంటే ఎంత భయమో.. అంతే గౌరవం కూడా. ఆయన తండ్రి రంగస్థల నటుడే. బ్రహ్మానందం కష్టపడి చదువుకుని, చిన్న లెక్చరర్ గా జీవితాన్ని మొదలు పెట్టారు.
తొలి సినిమా..
ఆ తర్వాత దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ తీసిన శ్రీతాతావతారం అనే చిత్రం ద్వారా బ్రహ్మానందం సినీ అరంగేట్రం చేశారు. నరేష్ హీరోగా వచ్చిన ఆ సినిమాలో బ్రహ్మానందం హీరో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు. తొలిసారిగా నటించిన సినిమా శ్రీ తాతావతారమే అయినా.. ముందుగా విడుదలైన సినిమా మాత్రం అహనా పెళ్లంట. పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట ! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోటతో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది.
అహ నా పెళ్లంట తో గుర్తింపు
అహ నా పెళ్లంట సినిమా తర్వాత బ్రహ్మానందం వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాను ఇంత గొప్ప నటుడిగా ఎదగడానికి కారణం జంధ్యాల, ఆ తర్వాత చిరంజీవి లే కారణమని చెప్తుంటారు బ్రహ్మానందం. రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్నారు బ్రహ్మానందం. ఆయన ఫేస్, ఆయన బట్టతల కనిపిస్తే చాలు.. ప్రేక్షకుడు నవ్వు ఆపుకోవడం కష్టమే సుమీ. సినిమాలో ఇచ్చిన క్యారెక్టర్ కు 100 పర్సెంట్ ప్రాణం పోస్తారు. ఒక్కోసారి బ్రహ్మీ పెట్టో ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తుంది. కేవ‌లం ఆయ‌న అప్పియ‌రెన్స్‌తోనే కొన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయంటే అతిశ‌యోక్తి కాదు. చిన్న లెక్చరర్‌గా జీవితం మొదలుపెట్టిన ఈయన.. ఈ రోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నాడంటే.. దాని వెనక ఎంతో కష్టం దాగుంది.
అవార్డులు.. పురస్కారాలు
35 ఏళ్ల సినీ ప్రస్థానంలో 1250 సినిమాల్లో నటించి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మానందం. ఇన్నేళ్ల సినీ కెరియర్ లో బ్రహ్మానందాన్ని ఆరు నంది అవార్డులు, ఒక ఫిల్మ్ ఫేర్, మూడు సైమా అవార్డులు వరించాయి. అహ నా పెళ్లంట సినిమాలో అరగుండు పాత్ర ద్వారా తొలి నంది అవార్డును అందుకున్నారు. ఐదు కళాసాగర్ పురస్కారాలు, తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు, పది సినీగోయర్స్ పురస్కారాలు, ఎనిమిది భరతముని పురస్కారాలు, రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం, ఆటా (అమెరికా), సింగపూర్, మలేషియా, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు. అలాగే విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు. పద్మమోహన సంస్థ బంగారు పతకాన్నిబహూకరించింది. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌, జర్నలిస్టు అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించి, స్వర్ణ కమలాలతో "కనకాభిషేకం" చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటును అందుకున్నారు బ్రహ్మానందం. టీ.ఎస్‌.ఆర్‌ కాకతీయ లలిత కళాపరిషత్‌ వారు బ్రహ్మానందానికి హాస్య కళా విధాత అవార్డును బహుకరించారు. 2009లో కేంద్ర ప్రభుత్వం బ్రహ్మానందంకు పద్మశ్రీని ఇచ్చింది.
ఒకప్పుడు బ్రహ్మానందం లేనిదే సినిమా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త కమెడియన్ లు పరిచయం కావడంతో.. వారికీ అవకాశాలివ్వాలన్న ఉద్దేశంతో బ్రహ్మీ కాస్త పక్కకు తప్పుకున్నారు. చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన.. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో సీరియస్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే.. పంచతంత్రం సినిమాలో కూడా వేద వ్యాస్ అనే మరో పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా మరో అరడజన్ సినిమాలకు ఒప్పుకున్నారు ఈ ఆల్ టైమ్ సీనియర్ కమెడియన్. ఈ నవ్వుల నవాబుకు సెలబ్రిటీలు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతున్నారు.




Tags:    

Similar News