ఆ 'ముద్దు' ఇంకా తడి ఆరలేదు : రేవంత్ రెడ్డి
ప్రజా కవి, గాయకుడు గద్దర్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు
ప్రజా కవి, గాయకుడు గద్దర్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఎల్బీ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ.. తుది దశ ఉద్యమానికి గద్దర్ ఇచ్చిన స్ఫూర్తిని నింపుకుని ఆయన కలలు కన్న తెలంగాణకై పోరాడుదామని పిలుపునిచ్చారు. గద్దర్.. పీడిత, తాడిత ప్రజల పక్షాన గళమై వినిపించారని అన్నారు. భూమి, ఆకాశం ఉన్నంతవరకూ ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంటుందన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని పేర్కొన్నారు. నాలాంటి వారికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవి, కళాకారుడు గద్దర్ అని అన్నారు. గద్దర్ అన్నతో నాకు వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు.
దొరల నుంచి తెలంగాణను కాపాడాలని తుది దశ ఉద్యమానికి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. తుది దశ తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చివరి శ్వాస వరకూ పరితపించారని అన్నారు. ఖమ్మం పభలో రాహుల్ గాంధీకి గద్దర్ అన్న పెట్టిన ముద్దు ఇంకా తడి ఆరలేదన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. గద్దరన్న అంతిమ యాత్రకు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.
ఆదివారం అంతిమయాత్ర గురించి గద్దర్ కుటుంబ సభ్యులతో రేవంత్ మాట్లాడారు. ఎల్బీ స్టేడియం నుండి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు సాగుతుందని తెలిపారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో నివాళులు అర్పిస్తారని వెల్లడించారు. అమరవీరుల స్థూపం నుంచి భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి పార్థివదేహం చేరుకుంటుందని తెలిపారు.