చంద్రన్నా.. ఇదేమి కానుకన్నా..?
కొత్త సంవత్సరం గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు సభలో ముగ్గురు మహిళలు మరణించారు
కొత్త సంవత్సరం గుంటూరులో విషాదం చోటు చేసుకుంది. కందుకూరు ఘటన మరవక ముందే మరొక ఘటన తెలుగుదేశం పార్టీని తలదించుకునేలా చేసింది. ఎన్ని సాకులు చెప్పినా ఈ మరణాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తాజాగా గుంటూరులో జరిగిన చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగింది. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగిపోయాయి. పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడం, కానుకల కోసం ఎగబడటం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యమే ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది.
పెద్దయెత్తున ప్రచారం చేసి...
గుంటూరు ఏటీ అగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవి (55), ఆసియా (34) తో పాటు మరొక మహిళ మృతి చెందింది. పోలీసులున్నా, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినా తెలుగుదేశం పార్టీ సభలో తొక్కిసలాట జరిగి మహిళలు మరణించడం రాజకీయ పార్టీలకు, ప్రధానంగా టీడీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారింది. కానుకలు ఇస్తామని ప్రచారం చేశారు. ఎంతమందికి ఇవ్వాలన్న దానిపై నిర్వాహకులకు క్లారిటీ ఉందో లేదో తెలియదు. కొందరికి మాత్రం టోకెన్లు ఇచ్చినట్లు తెలిసింది. వారికి మాత్రమే చంద్రన్న కానుకలు ఇచ్చేలా ప్లాన్ చేశారు. కానీ ఉచితంగా ఇస్తారంటే జనం వస్తారని మాత్రం ఊహించలేకపోయారు. వృద్ధుల నుంచి అందరూ సభకు తరలి వచ్చారు.
అన్ని ఏర్పాట్లు చేసినా...
బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేదు. కానుకలు ఇస్తామంటే జనం ఎగబడ్డారు. చంద్రబాబు సభలో ప్రసంగించిన అనంతరం ఆయన కొందరికి ఇచ్చి వెళ్లిపోయారు. తర్వాత పంపిణీ కార్యక్రమం మొదలయిన వెంటనే తొక్కిసలాట జరిగింది. భారీ ప్రాంగణం అయినప్పటికీ నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోలేదు. కానుకలను ఇంటింటికి పంపిణీ చేయవచ్చు. తమ నియోజకవర్గం పరిధిలో కార్యకర్తల చేత పంపిణీ చేసే వీలున్నా పబ్లిసిటీ కోసం, చంద్రబాబు సభ కోసం అందరినీ ఒకచోట చేర్చడంతోనే అసలు సమస్య ఎదురయింది.
పాఠాలు నేర్చుకోలేదే...?
కందుకూరులో జరిగిన ఘటన మరవకముందే గుంటూరు లో ఈ ఘటన జరగడంతో నిర్వాహకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సరైన చర్యలు తీసుకోకుండా ఎందుకు కానుకలను పంపిణీ చేశారని ఆయన నిర్వాహకులపై కేకలు వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంచనాకు మించి రావడంతోనే తొక్కిసలాట జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అనేక మంది గాయాలపాలయ్యారు. వరసగా ఘటనలు జరుగుతుండటంతో చంద్రబాబు సభల ఏర్పాటుపై నిర్వాహకులు సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మరిన్ని ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలున్నాయి.