పార్టీల గొప్పలు.. ప్రభుత్వాల తిప్పలు

గత ఏడాది జరిగిన కర్నాటక, తెలంగాణ ఎన్నికలు రాజకీయాల్లో కొత్త అంకానికి తెర తీశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రెండు చోట్లా జనాకర్షక ఉచిత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చింది. వాటి అమలును కూడా ప్రారంభించింది. కానీ ఆర్థికంగా ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Update: 2024-01-02 08:19 GMT

Unrealistic promises make the financial position of the states worse

గత ఏడాది జరిగిన కర్నాటక, తెలంగాణ ఎన్నికలు రాజకీయాల్లో కొత్త అంకానికి తెర తీశాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రెండు చోట్లా జనాకర్షక ఉచిత హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చింది. వాటి అమలును కూడా ప్రారంభించింది. కానీ ఆర్థికంగా ఆయా రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో ఆరు హామీలు అంటూ ఊదర కొట్టిన ‘హస్తం’... ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. ప్రజాపాలన అంటూ మిగిలిన హామీల అమలుకు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆ దరఖాస్తులను నకలు తీసి లక్షలు సంపాదించుకోవచ్చంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

ఓ ఆర్థికవేత్త అన్నట్లు పార్టీలు హామీలు ఇస్తాయి, కానీ వాటిని అమలు చేయాల్సింది ప్రభుత్వాలే. కాంగ్రెస్‌ ఇచ్చిన అన్ని హామీలూ డబ్బుతో కూడుకున్నవే. ఇప్పటికే అమలవుతున్న పథకాలతో పాటు వీటిని కూడా మొదలు పెట్టాలి. ఏ మాత్రం తేడా వచ్చినా దూది ఏకినట్లు ఏకి పారేయడానికి భారాస సిద్ధంగా ఉంది. తాము అస్సలు ‘తగ్గేదేలే’ అని అసెంబ్లీలో కేటీయార్‌, హరీష్‌ రావు తేల్చి చెప్పారు. ఇరవై నాలుగు గంటల్లో రైతు రుణ మాఫీ అంటూ ప్రకటించిన కాంగ్రెస్‌కు ఇంకా ఎంత టైం కావాలంటూ కేటీయార్‌ ప్ర్రశ్నించారు.

బహుశా ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రికి తాము ఇచ్చిన హామీల ‘విలువ’ తెలిసి ఉంటుంది. అందుకే ప్రాజెక్టుల సందర్శన, కేసీయార్‌ అవినీతి అంటూ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ఎక్కువ కాలం బండి నడపలేరు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమం, అభివృద్ధి... ఇవన్నీ నిధులతో ముడి పడి ఉన్నవే. తెల్ల రేషన్‌ కార్డును కొలమానంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు. లక్షల్లో ఆర్జించే ‘పేదలు’ కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. ఒక్క కార్డును తొలగించినా గోల చేయడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. పార్టీగా కాంగ్రెస్‌ ఎలాంటి హామీలిచ్చినా, ప్రభుత్వంగా రేవంత్‌ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

ఇది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఓ గుణపాఠం కావాలి. విశ్వసనీయత, నవరత్నాలు అంటూ జగన్‌ తాను ఇచ్చిన హమీలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే అప్పుల పాలు అయింది. చంద్రబాబు హయాంలో కూడా లక్షన్నర కోట్లు అప్పులయ్యాయని, తాను చేసిన అప్పులు జనానికి నేరుగా చేరాయని జగన్‌ చెబుతున్నారు. రేవంత్‌ రెడ్డి గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ‘జనానికి ఎన్ని హామీలిచ్చినా, వాటిని నెరవర్చేది వాళ్ల డబ్బులతోనే. నా జేబులోంచి వంద రూపాయలు కూడా నేనివ్వను కదా’ అన్నారాయన ఓ టీవీ ఇంటర్వ్యూలో. ఏ నాయకుడూ తన సొంత డబ్బు పంచి పెట్టడు.

ఇక ఏపీలో తెలుగుదేశం కూడా చాంతాడంత హామీల లిస్టు తయారు చేస్తోంది. తాను గతంలో వ్యతిరేకించిన, ఉచితాలను ఇందులో చేరుస్తున్నారు చంద్రబాబు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లా తాను కూడా హామీల అండతో గెలుస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక జగన్‌ మరెంత ఉదారం చూపిస్తారో చూడాలి. అధికారం మీద కాంక్షతో పార్టీలు, ఉచితాల మీద మోజుతో జనం కాంప్రమైజ్‌ అయితే... నాశనమయ్యేది రాష్ట్రాలు, అంతిమంగా దేశం.

Tags:    

Similar News