లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశించింది. దీంతో లిక్కర్ కింగ్ ఇక కష్టాలు ప్రారంభమయినట్లేచెప్పాలి. పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా భారత్ లోని బ్యాంకుల నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు. రెండేళ్ల క్రితమే ఆయన లండన్ పారిపోయారు. దీంతో ఆయనపై బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. భారత ప్రభుత్వం విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని వెస్ట్ మినిస్టర్ కోర్టును కోరింది. గత కొద్ది రోజులుగా భారత్ అధికారులు అక్కడే మకాం వేసి విజయ్ మాల్యాను లండన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2017నుంచి కోర్టులో విజయ్ మాల్యాపై విచారణ జరుగుతోంది. ఎట్టకేలకు సోమవారం విజయ్ మాల్యాను భారత్ కుఅప్పగించాలని ఆదేశించడంతో ఆయన ఇక భారత్ కు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.