పాదయాత్రలో జగన్ పై దాడి చేయడం సాధ్యం కాదని భావించే జనం లేని విశాఖ ఎయిర్ పోర్ట్ లో దాడిచేశారని వైఎస్ జగన్ తల్లి విజయమ్మ అన్నారు. పాదయాత్రలో దాడిచేస్తే దాడి చేసిన వ్యక్తి తప్పించుకోలేరని భావించే ఈ కుట్ర చేశారన్నారు. జగన్ పై హత్యాయత్నం జరుగుతుందని ముందే వారికి ఎలా తెలుసునని ప్రశ్నించారు. జగన్ కు ఇది పునర్జన్మ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయిన తమ కుటుంబం ఇంకా కోలుకోలేదని, ఈ హత్యాయత్నంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామన్నారు.
రేపటి నుంచి పాదయాత్ర.....
వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా పనిని ప్రారంభిస్తే మధ్యలో వదిలివేయకూడదని భావించి జగన్ రేపటి నుంచి పాదయాత్రకు బయలుదేరుతున్నారన్నారు. గత ఏడేళ్లుగా తమ కుటుంబం మధ్య కంటే జగన్ ప్రజల మధ్యనే ఎక్కువగా ఉంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. గత ఏడేళ్లుగా ఆర్థికంగా తమను దెబ్బతీయాలని అనేక మంది ప్రయత్నిస్తున్నారన్నారు. తన బిడ్డను ప్రజలే రక్షించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు.
వైఎస్ ను చూసి నేర్చుకోండి.....
ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే టీడీపీ నేతలు మాట్లాడిన తీరు తనకు బాధకల్గిస్తుందన్నారు. ఒక తల్లి, చెల్లి హత్యాయత్నం చేస్తారా? ఆ సంస్కృతి మనలో ఉందా? అని విజయమ్మ ప్రశ్నించారు. పరిటాల రవి హత్య కేసులో కన్న కొడుకు అని చూడకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణ వేసిన సంగతి గుర్తులేదా? అని నిలదీశారు. ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. వైఎస్ అభిమాని అయితే దానిపై విచారణ చేయరా? అని ప్రశ్నించారు. విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని అన్నారు.
మీరే రక్షకులు....
తప్పుడు లేఖలు సృష్టించడం, మడతలు లేని లేఖ పది గంటల తర్వాత బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. విశాఖ ఎయిర్ పోర్టుకు జగన్ కొన్ని నెలలుగా తరచూ వస్తుండా ఆ అభిమాని అన్ని రోజులు కలవకుండా అదే రోజు ఎందుకు కలిసి దాడికి పాల్పడ్డారన్నారు. జగన్ పై జరిగిన హత్యాయత్నంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని విజయమ్మ డిమాండ్ చేశారు. తిరిగి పాదయాత్రకు వెళుతున్న తన బిడ్డను ప్రజలు ఆశీర్వదించాలని, తన బిడ్డను మీరే కాపాడాలని, మీరే తన బిడ్డ రక్షకులని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరైతే ఈ దాడికి యత్నించారో వారికి కూడా నేను వినమ్రంగా చేతులెత్తి వేడుకుంటున్నానని, మరోసారి ఈ ప్రయత్నం చేయవద్దని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ కు, వైఎస్ కు నాటకాలాడటం తెలియదన్నారు. కోడికత్తి దాడి అంటూ ఎంత వెకిలిగా ా మాట్లాడారో అందరూ చూస్తున్నారన్నారు. చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత మధ్య ఎందుకు ఉన్నారని, ఆయనకు కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు.