వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రెండు రాష్ట్రాల పార్టీల నేతలు స్వాగతిస్తున్నారు. జగన్ తెలంగాణ ఎన్నికలు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేయడం లేదని, వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జగన్ పార్టీ తెలిపింది. అయితే 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేయాలని జగన్ నిర్ణయించారు.
ఏపీ ఎన్నికలే లక్ష్యంగా.....
నిజానికి జగన్ కు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే లక్ష్యం. అందుకోసం ఆయన ఏడాది నుంచి పాదయాత్ర చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి రాకుంటే పార్టీని నడపటం కూడా కష్టమే అవుతుంది. రాష్ట్రం విడిపోయాక కూడా జగన్ పార్టీకి తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ విజయం సాధించారు. కానీ వారంతా అధికార టీఆర్ఎస్ లో చేరిపోయారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో సమయం సరిపోదని జగన్ భావించారు.
వచ్చే ఎన్నికల నాటికి......
తాను ఏపీలో పాదయాత్రలో ఉన్నందున అక్కడ దృష్టి పెట్టలేనని, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాలు కూడా కష్టమవుతుందని తెలంగాణ వైసీపీ నేతలకు జగన్ సర్ది చెప్పగలిగారు. మరోవైపు ఇప్పుడు తెలంగాణలో మహాకూటమి, తెలంగాణ రాష్ట్ర సమితుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో పోటీ చేసి కూడా వృధాయేనని భావించి జగన్ బరిలో నుంచి తప్పుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే జగన్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని తెలంగాణ వైసీపీ నేతలు చెబుతున్నారు.