విజయనగరం జిల్లా లో ఎక్కడ ఆగిందో తనపాదయాత్రను జగన్ అక్కడినుంచి మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర చేరుకున్న వైసిపి చీఫ్ కత్తి దాడి తరువాత నేరుగా మీడియా తో మాట్లాడింది లేదు. సోషల్ మీడియా ద్వారా తాను క్షేమంగా వున్నా అని ట్వీట్ చేయడం ఆ తరువాత ఏపీ సర్కార్ ప్రమేయంలేని దర్యాప్తు సంస్థతో దాడి కేసులో విచారణ జరిపించాలని హై కోర్ట్ లో జగన్ కేసు దాఖలు చేయడం తప్ప ఆ సంఘటనపై స్పందించలేదు. దాంతో వైసిపి చీఫ్ తన పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేయబోయే బహిరంగ సభ లో విపక్ష నేత ఏమి మాట్లాడతారన్నది చర్చనీయాంశంగా మారింది.
సర్కార్ తీరును దుమ్మెత్తి పోస్తారా....?
విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై కత్తి దాడి అనంతరం ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును వైసిపి తీవ్రంగా తప్పు పట్టింది. బాధ్యత గల ముఖ్యమంత్రి ఈ కేసులో విపక్ష నేత పై చేసిన వ్యాఖ్యలను, డిజిపి చేసిన వ్యాఖ్యలను, కేసు విచారణ జరుగుతున్న తీరుపై జగన్ దుమ్మెత్తి పోస్తారన్న టాక్ వైసిపిలో వినిపిస్తుంది. దాడి పై వచ్చిన అనేక ప్రశ్నలకు జగన్ ప్రజల సమక్షంలోనే వెల్లడిస్తారన్నది ఆ పార్టీ వర్గాల సమాచారం. జగన్ తన పర్యటనకు బయలుదేరేముందు ఆయన తల్లి విజయమ్మ ఘాటుగా స్పందించారు.
విజయమ్మ మొదలెట్టారు ...
ప్రభుత్వ వ్యవహారసరళి ని విమర్శిస్తూ తల్లి, చెల్లి, పెళ్ళాం లను కూడా వారి రాజకీయాలకోసం ప్రస్తావించారని తీవ్ర స్థాయిలో టిడిపి ని టార్గెట్ చేశారు. అలిపిరి లో చంద్రబాబు పై దాడి జరిగితే వైఎస్ వ్యవహరించిన తీరు ఇప్పుడు జగన్ పై చంద్రబాబు వ్యవహరించిన తీరును పోల్చి ఛీ కొట్టారు. వాడిగా వేడిగా విజయమ్మ సంధించిన విమర్శలకు టిడిపి నుంచి నేరుగా ప్రతి విమర్శలు రాలేదు. కానీ టిడిపి నేతలు హోం మంత్రి చినరాజప్ప మొదలు కొని కాలువ శ్రీనివాసుల వరకు అంతా జగన్ పైనే తిరిగి విమర్శలు గుప్పించడం విశేషం. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మరింత ఘాటుగా స్పందిస్తారా లేక హై కోర్టు లో కేసు ఉన్నందున పెద్దగా ప్రస్తావించకుండా రొటీన్ ఆరోపణలతో సరిపుచ్చుతారా అన్నది చూడాలి.