ఈ సిట్టింగ్‌ల చీటీలు చిరిగినట్లే

వైసీపీ అధినేత జగన్ రెండోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.;

Update: 2022-12-19 07:25 GMT

వైసీపీ అధినేత జగన్ రెండోసారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక సార్లు ఇప్పటి వరకూ సర్వేలు చేయించినా కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి మాత్రం ప్రజల్లో అలాగే ఉంది. వారి పనితీరు కూడా మెరుగుపడలేదు. తనకు ఇష్టమైన, క్లిష్టసమయంలో తన పక్కన ఉన్నవారిని సయితం ఆయన పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు. కొందరిని నియోజకవర్గాలకు మారిస్తే ఎలా ఉంటుందని సర్వేలు చేయిస్తున్నారు.

దాదాపు డెబ్భయి మందికి...
దాదాపు 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి జగన్ ఝలక్ ఇచ్చే అవకాశముంది. వీరిలో కొందరిని నియోజకవర్గాలను ఛేంజ్ చేయాలని చూస్తున్నారు. వర్గ విభేదాలతో పాటు ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తితో ఉన్న వారిని వచ్చే ఎన్నికలకు సైడ్ చేయాలని చూస్తున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే అధికారం కోల్పోకతప్పదని నిర్ణయానికి వచ్చిన జగన్ వారికి ప్రత్యామ్నాయ నేతలను కూడా అన్వేషిస్తున్నారని తెలిసింది. ఏ అభ్యర్థి అయితే గెలుపు సాధ్యమవుతుందన్న దానిపై ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా సర్వేలు కూడా చేయిస్తున్నారని తెలిసింది. ఐ ప్యాక్ టీంతో పాటు సొంత మీడియా నుంచి కూడా ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో...
అందిన సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశముందని తెలిసింది. కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్, గిద్దలూరు నుంచి అన్నా రాంబాబు, కొండపి నుంచి గత అభ్యర్థి కాకుండా కొత్త వ్యక్తిని, కందుకూరు నుంచి మహీధర్ రెడ్డిని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించి మరో అనుకూలమైన నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారని పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. అద్దంకిలో కూడా గత అభ్యర్థి కాకుండా కొత్త వారిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉణ్నారు.
నెల్లూరు జిల్లాలో...
ఇక పక్కనే ఉన్న నెల్లూరు జిల్లా నుంచి కూడా దాదాపు ఐదు నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశముంది. నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కు ఈసారి టిక్కెట్ దక్కే అవకాశం లేదంటున్నారు. అలాగే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పక్కన పెట్టడం ఖాయమని చెబుతున్నారు. గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్ కు టిక్కెట్ దక్కే ఛాన్సేలేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. అలాగే వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణరెడ్డిని తప్పించి ఆయన స్థానంలో నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కూడా తప్పిస్తారంటున్నారు. ఆయనను ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలు లేకపోలేదు.
తక్కువ ఓట్లతో...
ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ మాత్రమే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ అనేక మందిని పక్కన పెట్టాలన్నదే పార్టీ హైకమాండ్ నిర్ణయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి పాలయిన వారిని కూడా పక్కన పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నారు. ఈ ఏడాదిన్నరలో ప్రజల్లో అసంతృప్తి ఉన్న నేతలు పుంజుకోవడం కష్టమని భావించిన జగన్ పార్టీ అధికారంలోకి వస్తే వారికి మరో రకంగా పదవులు ఇచ్చే అవకాశముందన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఇంతకీ వైసీపీలో అన్ లక్కీ ఎమ్మెల్యేలు ఎవరన్నది తెలిసిపోనుంది.


Tags:    

Similar News