లోకేష్ కోసం కొత్త స్కెచ్ రెడీ
నారా లోకేష్‌ను మరోసారి మంగళగిరిలో ఓడించేందుకు వైసీపీ స్కెచ్ వేసింది. కొత్త అభ్యర్థిని ఎంపిక చేయనుంది
టీడీపీ యువనేత, మాజీ మంత్రి లోకేష్‌ను గత ఎన్నికల్లో వైసీపీ పట్టుబట్టి మరీ మంగళగిరిలో ఓడించింది. రకరకాల ఈక్వేషన్లతో మంగళగిరిలో లోకేష్‌కు చెక్ పెట్టేసింది. దీంతో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన లోకేష్‌కు ఆ ఓటమి జీవితంలోనే పెద్ద చేదు అనుభవంగా మిగిలిపోయింది. విచిత్రం ఏంటంటే లోక్‌సభకు పోటీ చేసిన గల్లా జయదేవ్‌కు మెజార్టీ వచ్చినా అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం లోకేష్ ఓడిపోయారు.
ఏళ్లుగా టీడీపీకి...
గత ఎన్నికల్లో లోకేష్ పార్టీ 25 ఏళ్లుగా గెలవని మంగళగిరిలో పోటీ చేయడమే పెద్ద సాహసం. ఓడిపోయినప్పటి నుంచి లోకేష్ మంగళగిరిని వదిలిపెట్టలేదు. ఇంకా చెప్పాలంటే తనపై గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ సొంత నిధులతో అక్కడ అభివృద్ధి పనులు చేశారు. తన ఎమ్మెల్సీ నిధులు, ఇటు సొంత నిధులతో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం.
ఈసారి కూడా మంగళగరి నుంచే...
ఇక మంగళగిరిపై గట్టిగా దృష్టి పెట్టిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో అక్కడే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజధాని వికేంద్రీకరణ ప్రభావం, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రెండుసార్లు గెలిచినా నియోజకవర్గానికి ఉపయోగం లేదన్న భావన స్థానికంగా ఉండడంతో ఈ సారి లోకేష్ గెలుపు సులువు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సారి జగన్ మరో కొత్త స్కెచ్‌తో ఇక్కడ లోకేష్‌ను ఓడించేందుకు ప్లాన్ వేస్తున్నట్టు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
చేనేతలే ఎక్కువ...
మంగళగిరి నియోజకవర్గంలో చేనేతల ఓటింగ్ ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం నుంచే బీసీ కార్డు ప్రయోగించి అభ్యర్థిని జగన్ ఎంపిక చేయనున్నారు. అందుకే ఈ సామాజిక వర్గంలో కీలక నేతలను అందరిని జగన్ వైసీపీలోకి లాగేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీని చేశారు. అదే చేనేత వర్గానికి చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చారు.
బలమైన నేతలను...
ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సైతం వైసీపీలో ఉండి వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నారు. ఆమె మారుగుడు హనుమంతరావుకు స్వయానా వియ్యపురాలు. ఇక 2014లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసి 12 ఓట్ల స్వల్ప తేడాతో ఓడి.. మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన గంజి చిరంజీవిని కూడా వైసీపీలోకి లాగేసుకున్నారు. ఇక చేనేతల్లో బలమైన నేతలు అందరూ ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు.ఆయనకు కూడా నామినేటెడ్ పదవిని కట్టబెట్టి పద్మశాలి సామాజికవర్గంలో నేతగా ముందుగానే పంపారు. కేవలం లోకేష్‌ను ఓడించే టార్గెట్‌తోనే జగన్ ఈ సారి ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని బీసీ కార్డు ప్రయోగించడంతో పాటు ఆ వర్గాన్ని ఏకం చేసేందుకు పై నుంచి స్కెచ్‌లు గీస్తున్నట్టే ఉంది. వైసీపీ ఈ సారి కూడా లోకేష్‌ను ఓడిస్తే రాజకీయంగా లోకేష్‌ను పూర్తిగా దెబ్బ కొట్టినట్టు అవుతుందనే భావిస్తోంది. అందుకే ఈ సారి మంగళగిరిలో ఆట సరికొత్తగా మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది.