గుడ్డి నమ్మకం.. నిర్లక్ష్యం మరోసారి

వైసీపీ వరస అపజయాలతో సతమతమవుతుంది. మొన్న గ్రాడ్యుయేట్, నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు

Update: 2023-03-23 13:31 GMT

పెత్తనం పాయసంలాగా తియ్యగా ఉంటుంది. ఆ పెత్తనమే దూరమైతే.. అదే జరిగింది. దాని ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి. ఎమ్మెల్యేలు పెత్తనానాకి దూరమయ్యారు.లీడర్ అంటే వ్యూహాలు ఉండాలి. తగ్గి ఉండాలి. అంతే తప్ప తన బొమ్మతోటే గెలిచారనుకుని ఎమ్మెల్యేలను తక్కువగా చూస్తే దాని ప్రతిఫలాన్ని సరైన టైం వచ్చినప్పుడు వాళ్లు చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు అదే ఎదుర్కొంటున్నారు. ఆయన ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ ఇవ్వరు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తమ బాధలను వైసీపీ ఎమ్మెల్యేలను చెప్పుకోవాల్సిందే. కనీసం సీఎంవో కూడా వారి బాధలను వినరు. దీంతో ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా అసంతృప్తితోనే ఉన్నారు. తమకు ఎలాంటి అధికారాలు లేకుడా బొమ్మలుగా మార్చారన్న వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి వినిపించాయి.

విభేదాలు మామూలుగా...
ఇక నియోజకవర్గాల్లో విభేదాలు మామూలుగా లేవు. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రతిగా మరొకరిని వైసీపీ హైకమాండ్ ప్రోత్సహిస్తుంది. దీంతో నేతల మధ్య విభేదాలను జగన్ పరిష్కరించే ఆలోచన చేయలేదు. పోనీ టీడీపీ నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీ నేతలుగా చూశారా? అంటే అదీ లేదు. అక్కడ వైసీపీ నేతలు రెచ్చిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చారు.
పెత్తనమేదీ?
మరోవైపు జగన్ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం పేరుతో టార్చర్ పెట్టారంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థను పెట్టారు. లబ్దిదారుల ఎంపిక నుంచి పథకాల చేర వేసే వరకూ వాళ్లే చూసుకుంటారు. ఇక డీబీటీ పథకం కింద నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జగన్ తాడేపల్లి నుంచి డబ్బులు పంచుతున్నారు. ఇక ఎమ్మెల్యేలకు ఏం విలువ ఉ:టుంది. అందుకే గడప గడపకు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను ప్రజలు లెక్క చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతూ వస్తుంది. కానీ జగన్ తనను దాటి ఎవరూ వెళ్లరన్న గుడ్డినమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదంటూ వారి పేర్లను కూడా నేరుగా చదివి వినిపించడం కూడా కొందరికి చిరాకుగా మారింది.
ఏడాది మాత్రమే...
ఇవన్నీ చంద్రబాబుకు కలసి వచ్చాయి. ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కూడా తమ రాజకీయ భవిష్యత్ ను తాము చూసుకుంటారు. అందుకే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లుంటారు. చంద్రబాబు నుంచి భరోసా తీసుకున్న తర్వాతే క్రాస్ ఓటింగ్ కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్పడ్డారన్నది వాస్తవం. తాడేపల్లిలో కూర్చుని రాజకీయం చేద్దామంటే జగన్ కు సార్వత్రిక ఎన్నికలకు ముందు రెండు అపజయాలు ఎదురయ్యాయి. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమయినట్లు? అన్న కామెంట్స్ కూడా పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అవతల ప్రత్యర్థి చంద్రబాబు. నలభై ఏళ్ల అనుభవం ఉండి, వ్యూహాలు..ఎత్తులు పై ఎత్తులు ఎలా వేయాలో తెలుసు. అయినా జగన్ అండ్ టీం మరోసారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిించింది.


Tags:    

Similar News