టోకెన్లు ఇచ్చారు.. వీక్‌నెస్ పట్టేశారు

నిన్న గుంటూరులో జరిగిన తొక్కిసలాట మానవ తప్పిదమే. ఖచ్చితంగా నిర్వాహకుల నిర్లక్ష్యంగానే చూడాలి.

Update: 2023-01-02 03:48 GMT

నిన్న గుంటూరులో జరిగిన తొక్కిసలాట మానవ తప్పిదమే. ఖచ్చితంగా నిర్వాహకుల నిర్లక్ష్యంగానే చూడాలి. ముగ్గురు మహిళలు మృతి చెందిన సంఘటన మరోసారి కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ సభ నిర్వహణ వైఫల్యాన్ని మరోసారి ఎత్తి చూపింది. ఏర్పాట్లన్నీ సజావుగా చేసినా అనుకున్న సమయానికి పంపిణీ చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మహిళలను గ్రౌండ్ కు తరలించారు. చంద్రబాబు 3 గంటలకు సభావేదిక వద్దకు రావాల్సి ఉన్నా ఆయన వచ్చే సరికి ఆలస్యమయింది.

చంద్రబాబు సభ ముగిసిన తర్వాత...
దీంతో నిర్వాహకులు చంద్రబాబు చేత కొద్ది మందికి లాంఛనంగా పంపిణీ చేయించి ఆయనను పంపించి వేశారు. అనంతరం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్యారికేడ్లు కట్టారు. పోలీసు బందోబస్తు ఉంది. పదిహేను లారీలలో కానుకలు తెచ్చి పంచేందుకు సిద్ధమయ్యారు. కానీ అంచనాకు మించిన జనం రావడంతో నిర్వాహకులు కూడా నివ్వెరపోయారు. కొందరికి కానుకులను పంపిణీ చేసిన అనంతరం తాము ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పడంతో ఇక తమకు దొరకవని భావించిన మహిళలు ఒక్కసారిగా తొక్కిసలాటకు దిగారు. అందువల్లనే మరణాలు సంభవించాయని పోలీసులు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు.

ముందుగానే ఎంపిక చేసుకుని....
కొత్త ఏడాది సందర్భంగా ఈ ప్రభుత్వం విస్మరించిన సంక్రాంతి కానుకను ప్రజలకు పార్టీ అధినేత ద్వారా ఇవ్వాలనుకున్నారు. అందులో ఎంత మాత్రం తప్పులేదు. ఒక రాజకీయ పార్టీగా ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయవచ్చు. కానీ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పెద్ద మైదానాన్ని ఎంచుకున్నారు. అందుకు తగినట్లుగానే మహిళలను కూడా ముందుగానే ఎంపిక చేసుకున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పది రోజుల నుంచి చంద్రన్న సంక్రాంతి కానుక, చీరలను పంపిణీ చేస్తామని నిర్వాహకులు పెద్ద యెత్తున ప్రచారం చేసుకున్నారు.
ఇంటికి వెళ్లి...
ప్రతి ఇంటికి వెళ్లి టోకెన్లను పంపిణీ చేశారు. టోకెన్లు ఉన్న మహిళలకే కానుకలు ఇస్తామని చెప్పడంతో అవి తీసుకున్న మహిళలు ఖచ్చితంగా సభకు వస్తారని ఎత్తుగడ వేశారు. అనుకున్నట్లుగానే మానవ నైజం ప్రకారం తమ వద్ద టోకెన్లు ఉండటంతో తమకు కానుకలు వచ్చినట్లే మహిళలు భావించారు. అందుకే పెద్దయెత్తున తరలి వచ్చారు. టోకెన్లు ఇంటింటికి తిరిగి ఇచ్చిన పార్టీ కార్యకర్తలు కానుకలు కూడా ఇచ్చి ఉంటే ఇంతటి దారుణం జరిగి ఉండేది కాదు కదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళల వీక్ నెస్ ను పసిగట్టి టోకెన్లు ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రజల బలహీనతతో ఆడుకోవద్దన్న సూచనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News