ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. టీడీపీ కంచుకోటలపై గురి
వైసీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జిలకు జగన్ ఈ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు ఎవరైతే ఇంఛార్జిలుగా గడప గడపకు వెళుతున్నారో వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తారనే స్పష్టత కూడా పార్టీ వైపు నుంచి ఉంది.
ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నా ఇప్పటినుంచే ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీ ఇంఛార్జిలకు జగన్ ఈ బాధ్యతలను అప్పగించారు. ఇప్పుడు ఎవరైతే ఇంఛార్జిలుగా గడప గడపకు వెళుతున్నారో వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తారనే స్పష్టత కూడా పార్టీ వైపు నుంచి ఉంది.
అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో పార్టీలో వర్గపోరు నడుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల లాగానే ప్రకాశం జిల్లాలో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్మారు. కానీ, అనూహ్యంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వచ్చే ఎన్నికల్లో ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు గెలిచేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ గత ఎన్నికల్లో ఓడిన నాలుగు నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ నాయకత్వలేమి, వర్గపోరు వంటి సమస్యలు వైసీపీలో ఉన్నాయి. వీటిపై కొన్ని రోజులుగా నేతలతో చర్చలు జరిపిన జగన్ చివరకు ఇంఛార్జిలను నియమించారు. దీంతో వర్గపోరు సమసిపోయే అవకాశం ఉంది.
ముఖ్యంగా, చీరాల నియోజకవర్గ వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఒకవైపు ఆమంచి కృష్ణమోహన్, మరోవైపు కరణం బలరాం కుమారుడు వెంకటేశ్ ఈ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్‌తో మాట్లాడిన జగన్.. చీరాల ఇంఛార్జిగా కరణం వెంకటేశ్‌ను నియమించారు. ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇంఛార్జిగా పంపించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత పర్చూరులో వైసీపీకి బలమైన నాయకుడి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమంచిని పర్చూరుకు పంపించడం ద్వారా చీరాలలో వర్గపోరును, పర్చూరులో నాయకత్వలేమిని జగన్ పరిష్కరించుకున్నారు. వీరిద్దరూ ఈ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఇక, కొండపి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఓడిన వెంకయ్యను పక్కకు పెట్టి వరికూటి అశోక్ బాబును ఇంఛార్జిగా నియమించారు.
వచ్చే ఎన్నికల్లో కొండపి నుంచి అశోక్ బాబు పోటీ చేయడం ఖాయమైంది. టీడీపీకి, ముఖ్యంగా గొట్టిపాటి రవికి కంచుకోట లాంటి అద్దంకి నియోజకవర్గంపైనా జగన్ దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచి కరణం కుటుంబానికి టిక్కెట్ ఇస్తారా ? గరటయ్య కుటుంబానికి ఇస్తారా ? అనే డైలమా వైసీపీ శ్రేణుల్లో ఉంది. దీనిపై కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. గరటయ్య కుమారుడు బాచిన కృష్ణచైతన్యను అద్దంకి ఇంఛార్జిగా నియమించారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇలా ముందుగానే అభ్యర్థులపై స్పష్టత ఇవ్వడం ద్వారా టీడీపీ గెలిచిన ఈ నాలుగు స్థానాలను వచ్చేసారైనా గెలిచేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.