రాష్ట్రంలో బోగస్ ఓట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం ఫలిస్తున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలో 50 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయంటూ అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం జారీ చేశారు. ఈ పిటీషన్ ను కోర్టు విచారణకు స్వీకరించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ డిసెంబరు 11వ తేదీకి కేసును వాయిదా వేసింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లో కోర్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లను తొలగించే వరకు తమ పోరాటం ఆపమని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
కోర్టుకు పూర్తి ఆధారాలు
రాష్ట్రంలో బోగస్ ఓట్లపై లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా పరిశీలన చేశారు. ఆయన ఏకంగా 3 కోట్ల 60 లక్షల ఓట్లను పరిశీలించగా అందులో 52 లక్షల 67 వేల ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయని తెలింది. ఇటీవల కొత్తగా చేర్చిన 32 లక్షల ఓట్లలో అధిక శాతం దొంగ ఓట్లేనని వారు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు హక్కు ఉందని గుర్తించారు. ఇక కొన్ని ప్రాంతాల్లో 1, 5 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి కూడా ఓటు హక్కు ఉంది. ఇదే సమయంలో 250, 350 ఏళ్ల వయస్సు వారు ఉన్నట్లు, వారికి ఓటు హక్కు ఉన్నట్లుగా ఓటరు లిస్టులో గుర్తించారు.
25 పెన్ డ్రైవ్ లలో సమాచారం...
దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన వెంకటరామిరెడ్డి, లోకేశ్వర్ రెడ్డి బృందం పూర్తి ఆధారాలతో కోర్టులో పిటీషన్ వేసింది. 52 లక్షల 67 వేల బోగస్ ఓట్లకు సంబంధించిన వివరాలు కోర్టుకు అందజేశారు. 64 జీబీ మెమొరీ ఉన్న 25 పెన్ డ్రైవ్ లు కోర్టుకు అందజేశారంటే మామూలు విషయం కాదు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఈ కేసును వాదిస్తున్నారు. అయితే, బోగస్ ఓట్ల వెనుక ప్రభుత్వం కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రానున్న ఎన్నికలకు ముందే ఈ బోగస్ ఓట్లను ఏరివేసేలా కోర్టులో పోరాటం చేస్తామని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.