వైసీపీ కొత్త ఎత్తుగడ.. షిఫ్టింగ్ తో టీడీపీకి చెక్
వచ్చే ఎన్నికలకు వైసీపీ కొత్త వ్యూహం అనుసరిస్తుంది. అధినేత జగన్ వద్ద కొన్ని ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు
వచ్చే ఎన్నికలకు వైసీపీ కొత్త వ్యూహం అనుసరిస్తుంది. అధినేత జగన్ వద్ద కొన్ని ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. దాని వల్ల ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజకీయంగా ఇబ్బంది పడకుండా, అలాగని వారి వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూడాల్సి ఉంది. అందుకే నియోజకవర్గాలను షిఫ్ట్ చేసే ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం ఉంది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రస్తుతం ఉన్న నియోజకవర్గం దక్కకపోయినా మరొక చోట పోటీ చేయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అసంతృప్తి పెరగడంతో...
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఇది ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నివేదికలు కూడా స్పష్టమవుతున్నాయి. నియోజకవర్గాలు మారిస్తే అక్కడ వైసీపీ గెలుపు సాధ్యమవుతుందన్న నివేదికలు అందుతున్నాయి. సొంత పార్టీలోనే కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రస్తుత హోంమంత్రి తానేటి వనితకు అక్కడ వైసీపీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఆమెను గోపాలపురం నియోజకవర్గానికి పంపాలనుకుంటున్నారు. అక్కడ ఉన్న తలారి వెంకట్రావుకు మరో చోట అవకాశం కల్పించేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్ధమవుతుంది.
నియోజకవర్గాలను మారిస్తే...
ఇక గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరిత కు ఈసారి టిక్కెట్ దక్కడం కష్టంగానే ఉంది. ఆమె కుటుంబం బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తుంది. ఈసారి ప్రత్తిపాడుకు కొత్త అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక తాడికొండ నియోజకవర్గంలోనూ ఉండవల్లి శ్రీదేవి ప్రజల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆమెను మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేయాలన్న యోచనలో అధికార పార్టీ నాయకత్వం ఉంది. అది ప్రత్తిపాడా? లేక మరో నియోజకవర్గమా? అన్నది సర్వే నివేదికల తర్వాత తేలనుంది.
రిజర్వడ్ నియోజకవర్గాల్లోనే...
ఇక బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్ కు తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చే శాసనసభకు పోటీ చేయించాలన్న ప్రతిపాదన కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుందని తెలిసింది. దీంతో పాటు వేమూరు నుంచి ప్రస్తుత మంత్రి నాగార్జున ను కూడా అక్కడి నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆయనకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఇస్తారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. ప్రధానంగా రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ ఈ విధమైన ఎత్తుగడకు దిగాలని యోచిస్తుంది. అయితే ఇది ఎంతవరకూ పనిచేస్తుందీ? ఈ ప్రతిపాదనలకు సిట్టింగ్ లు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద కొత్త ఎత్తుగడతోనే వైసీపీ అధినాయకత్వం సీట్ల మార్పిడికి సిద్ధమవుతుందని సమాచారం.