ఇద్దరు నాయుడుల వద్దకు వచ్చిన పంచాయతీ ఏంటో తెలుసా?

Update: 2017-02-02 03:57 GMT

బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలే కదా? కాని నెల్లూరు తమ్ముళ్లకు దీని విషయంలో డౌటు వచ్చింది. రాష్ట్రమంతా టీడీపీ, బీజేపీ చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంటే నెల్లూరులో మాత్రం కారాలు మిరియాలు నూరుకుంటున్నారు తెలుగుదేశం, బిజేపీ కార్యకర్తలు. ఇంతకీ ఎందుకో తెలుసా? ఓ భూ వివాదం వీరి మధ్య పగను రగిల్చింది. కక్షలను పెంచింది. చివరకు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వద్దకు ఈ పంచాయతీ చేరింది. నెల్లూరు జిల్లాలో ఆ సీన్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

కర్నాటి ఏం చేశారంటే...

నెల్లూరు జిల్లా సంగం మండలంలో భూ వివాదం అధికార పార్టీ, బీజేపీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. సంగం మండలంలో సీలింగ్ ల్యాండ్ ను తమ అనుచరుడికి ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయ రెడ్డి పట్టుబడుతున్నారు. దీనిపై అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చారు. ప్రభుత్వ భూమి కావడంతో అది సాధ్యపడదని అధికారులు బీజేపీ నేతకు తేల్చి చెప్పేశారు. దీంతో కర్నాటి ఆంజనేయ రెడ్డి వీఆర్వో పై విరుచుకుపడ్డారు. తహసిల్దార్ ఎదుటే వీఆర్వోను కొట్టినంత పనిచేశారు. అంతు చూస్తానని బెదిరించారు కూడా. అంతటితో ఊరుకోని ఆంజనేయ రెడ్డి దువ్వూరుకు చెందిన ఆనం ప్రసాద్ రెడ్డి పై కూడా తిట్ల పురాణం అందుకున్నారు.

టీడీపీ నేతలు సీరియస్....

ఇది తెలిసిన తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్ అయ్యారు. మండల కేంద్రం వద్ద వార్ కు రెడీ అయ్యారు. వీఆర్వో జోలికొస్తే ఊరుకునేది లేదని కర్నాటికి హెచ్చరికలు జారీ చేశారు. ధర్నాకు కూడా దిగారు. దీంతో ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ ల మధ్య పోరు ప్రారంభమైంది. ఆత్మకూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. కర్నాటి దుర్భాషలాడిన ఆనం ప్రసాదరెడ్డి రాంనారాయణరెడ్డికి దగ్గరి బంధువు. దీంతో ఆనం కూడా ఈ విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూమిని ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ పంచాయతీ కర్నాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి వద్దకు, ఆనం రామనారాయణ రెడ్డి చంద్రబాబు నాయుడుల వద్దకు చేరింది.

సీలింగ్ భూములపై కన్ను.....

సంగం మండలం సిద్ధీపురం పంచాయతీలో సర్వే నెంబరు 949లో సుమారు 200 ఎకరాల సీలింగ్ భూములున్నాయి. ఇందులో అదే గ్రామానికి చెందిన 25 మందికి గతంలో 60 ఎకరాలను పంపిణీ చేశారు. అదే గ్రామంలో ఒక మహిళ సాగు చేసుకుంటున్న సీలింగ్ భూమిని శ్మశానానికి కేటాయించారు. ఆ భూమిని తన వర్గానికి చెందిన వారికే ఇవ్వాలని కర్నాటి పట్టుబట్టడంతో సమస్య తలెత్తింది. మొత్తం విషయం ఏం అర్ధమైందంటే...సీలింగ్ భూములను తన అనుచరులకు కట్టబెట్టేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఇదండీ విషయం.

Similar News