ఇద్దరూ....ఇద్దరే.....

Update: 2017-01-05 21:30 GMT

ఇద్దరూ ముఖ్యమంత్రులే. ఇద్దరి పేర్లూ దాదాపుగా ఒకటే. ఇద్దరూ దాదాపు సమ వయస్కులే. ఇద్దరూ ఒకే పార్టీలో పనిచేసిన వారే. కాని ఇద్దరి పనితీరులో ఎంత తేడా? ఇద్దరి హావభావాల్లో ఎంత బేధం? ఇద్దరి వ్యవహార శైలిలో ఎంత వైరుధ్యం? వారే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు. ఇద్దరు ముఖ్యమంత్రుల పనితీరుపై స్పెషల్ ఫోకస్

అనుభవమున్నా.....

చంద్రబాబు ముఖ్యమంత్రిగా గతంలో తొమ్మిదన్నరేళ్లపాటు పని చేసిన అనుభవం ఉంది. ఇప్పటికీ ఆయన స్పీచ్ బోరు కొడుతుంది. చెప్పిందే...చెప్పి విషయాన్ని సాగదీస్తారు. రోజులో కనీసం నాలుగైదు సార్లు టీవీలో కన్పిస్తారు. టెలి కాన్షరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, సమీక్షలు, మీడియా మీట్ లు, బహిరంగ సభలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇలా చంద్రబాబు దినమంతా బిజీ షెడ్యూల్ తో గడిపేస్తారు. చూసే వారికి తీరిక లేని పనిలో బాబు ఉన్నాడనిపిస్తారు. ఇక చంద్రబాబు జిల్లాల పర్యటన కూడా ఎక్కువగానే చేస్తారు. నిత్యం సచివాలయంలో అధికారులు, మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తుంటారు. చంద్రబాబు తనపై విమర్శలు చేస్తే తట్టుకోలేరు. వెంటనే బరెస్ట్ అయిపోతారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన మామూలు స్థాయి నేతనైనా ఆయనే విమర్శిస్తారు. ఆయన తన తొమ్మిదన్ననరేళ్ల ముఖ్యమంత్రి అనుభవాన్ని తరచూ గుర్తు చేస్తుంటారు. పదే పదే హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకొస్తారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు ఎక్కువగానే జరుపుతుంటారు. సొంతంగా ఏ మంత్రీ విదేశాలకు వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించే ఛాన్స్ ను బాబు ఇవ్వనే ఇవ్వరు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతను పూచికపుల్లతో తీసి పారేస్తారు. రాజకీయ అనుభవం లేనివారని కొట్టిపారేస్తారు. ఒక నిర్ణయం తీసుకునేందుకు నాలుగు రకాల ఆలోచనలను చంద్రబాబు చేస్తారని చెబుతారు. ఏ సమస్యనూ అంత తొందరగా పరిష్కరించరు. కాలమే పరిష్కరిస్తుందన్నది ఆయన నమ్మకమంటారు. అందుకే పార్టీలో గ్రూపు తగాదాలున్నా వెంటనే చర్యలు తీసుకోరు. కమిటీలు వేసి కాలయాపన చేస్తుంటారని చంద్రబాబుపై విమర్శ.

కూల్..కూల్...గా

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తొలిసారి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికిముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం రెండున్నరేళ్లే. మాటకారి. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగుతుంది. లోకల్ లాంగ్వేజ్ తో పంచ్ లపై పంచ్ లిస్తారు. పుస్తకాల పురుగు. ఆయన చదవని పుస్తకమంటూ ఏదీ లేదు. భాష పై మంచి పట్టుంది. ఇక ఆయన ఎప్పుడూ బిజీ గా ఉన్నట్లు కన్పించరు. హైరానా అసలే పడరు. కూల్ ముఖ్యమంత్రిగా పేరు. ముఖ్యమంత్రి గా బిజీ షెడ్యూల్ ఉన్నా నెలలో రెండు మూడు రోజులైనా ఫాంహౌస్ కెళ్లి చెట్ల మధ్య ప్రశాంతంగా గడిపి వస్తారు. కాన్ఫరెన్స్ ల జోలికి అసలే పోరు. మీడియాలో అతి తక్కువే కన్పిస్తారు. ఒకసారి మీడియా ముందుకు వచ్చారంటే అది ఏదో ప్రాధాన్యత అంశం అయితే తప్పరారు. జిల్లాల పర్యటన కూడా కేసీఆర్ అతి తక్కువగానే చేస్తారు. ఎక్కువగా సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఉండటానికి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడే ఉండి పాలన సాగిస్తారు కూల్ గా. ఇక ప్రత్యర్థిపై విమర్శలు ఆయన నిత్యం చేయరు. ఏదో ఒక సమయంలో ఆయన అనుకున్నప్పుడు వచ్చి విమర్శనాస్త్రాలు సంధించిపోతారు అంతే. ఇక కేసీఆర్ విదేశీ పర్యటనల పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చరు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశాలకు వెళ్లింది ఒకట్రెండుసార్లే. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేతజానారెడ్డికి తగిన గౌరవం ఇస్తారు. అప్పడుడప్పుడు జానాను పొగుడుతారు కూడా. మనసులో పెట్టుకున్నారంటే ఆ వ్యక్తి పని పట్టిందాకా కేసీఆర్ వదలంటారు. ఇక నిర్ణయం తీసకుంటే అది అమలు జరగాల్సిందే. వెనకా ముందూ చూడరు. సమస్యను ఎక్కువ కాలం నాన్చరు. వెంటనే దానికి పరిష్కారం చేస్తారు. అది పార్టీలోనైనా ప్రభుత్వంలోనైనా ఉదాహరణకు డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య పై అవినీతి ఆరోపణలు రాగానే వెంటనే పదవి నుంచి తొలగించారు. ఏమాత్రం ఆలోచించలేదాయన. పార్టీలో గ్రూపు తగాదాలకు చాన్స్ ఇవ్వరు. ఒకవేళ తన దృష్టికి వస్తే వెంటనే వారి పనిపడతారంటారు పార్టీ నేతలు. అయితే కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తారన్న విమర్శ కూడా ఉంది. ఆయన దగ్గరకు వెళ్లాలంటే మంత్రులు కూడా వెనకడుగు వేస్తారట. ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ దైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. ఇద్దరిలో మైనస్ లు, ప్లస్ పాయింట్లున్నా...ఎవరి దారి వారిదే...ఎవరి స్టయిల్ వారిదే.

Similar News