పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్-టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం నిర్మాణం., కాంగ్రెస్ కృషిని వివరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ., ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. 1983 -2004 మధ్య 16ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉంటే అందులో తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని అప్పుడు ఏ మాత్రం పోలవరం గురించి ఆలోచించలేదని కేవీపీ ఎద్దేవా చేశారు. రాజకీయ జీవితాన్ని ఇవ్వడంతో పాటు ఎన్టీఆర్‌కు అల్లుడయ్యే అవకాశం కల్పించిన ఇందిరాగాంధీ పేరును తొలగించి బాబు తన నైజాన్ని బయటపెట్టుకున్నారని., 2004 -14 మధ్య పోలవరంకు అనుమతులు రావడంతో పాటు పనులు వేగంగా జరగడానికి కాంగ్రెస్ మాత్రమే చిత్తశుద్ధితో కృషి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
కేవీపీ లేఖపై మండిపడ్డ టీడీపీ నేతలు ఆయనపై విమర్శలకు దిగారు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప కేవీపీ పోలవరానికి చేసిందేమి లేదని తిప్పికొట్టారు. కాంక్రీట్ పనులు ప్రారంభించకపోవడం., నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించడం వెనుక కేవీపీ ఉన్నారని మంత్రి దేవినేని విమర్శించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలవరం గురించి మాట్లాడే అర్హత కేవీపీకి లేదని., డ్యాం సైట్‌లో ఒక్క గ్రామాన్ని కూడా ఖాళీ చేయించని కాంగ్రెస్ ఇప్పుడు పనుల వేగాన్ని చూసి కంగారు పడుతోందని ఆరోపించారు. కేవీపీపై దేవినేని ఉమా విమర్శలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఉమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమా దిష్టిబొమ్మకు చీర కట్టి., గాజలు తొడిగి., సన్మానం చేశారు. ఉమాకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని., దేవినేని ఉమాకు దమ్ముంటే ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.