తండ్రిపై తనయుడు తిరుగుబాటు

Update: 2016-12-29 09:20 GMT

ఉత్తర ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీలో గ్రూపు పాలిటిక్స్ తారా స్థాయికి చేరుకున్నాయి. తండ్రి ములాయంపై తనయుడు అఖిలేష్ తిరుగుబాట బావుటా ఎగురవేసుందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ములాయం ఏకపక్ష నిర్ణయాలకు పార్టీ భ్రష్టుపట్టిపోతుందన్నది అఖిలేష్ అనుచరుల వాదన. అందుకోసమే రెబల్స్ గా బరిలోకి దిగాలని అఖిలేష్ మద్దతుదారులు భావిస్తున్నారు.

నిన్న ములాయం 325 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించారు. అందులో అఖిలేష్ అనుకూలురైన వారికి సీట్లు దక్కలేదు. అసలు అఖిలేష్ ఇచ్చిన అభ్యర్ధుల జాబితాను ములాయం పూర్తిగా పక్కన బెట్టేసి తన తమ్ముడు శివపాల్ యాదవ్ ఇచ్చిన జాబితానే ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 224 మందికి తిరిగి టిక్కెట్లు దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ములాయం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే అఖిలేష్ వర్గం మాత్రం నేతాజీ ప్రకటించిన అభ్యర్ధుల్లో ఎక్కువ మందికి నేర చరిత్ర ఉందని చెబుతున్నారు. అలాంటి వారికి టిక్కెట్లు కట్టబెడితే వారి ప్రభావం రాష్ట్రమంతటా పడుతుందని చెబుతున్నారు. అఖిలేష్ లేని సమయంలో జాబితాను ప్రకటించడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. ఇదే ఫైనల్ అయితే తాము కూడా రెబల్ అభ్యర్ధులుగా రంగంలోకి దిగి తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు అఖిలేష్ అనుకూలురు. గురువారం అఖిలేష్ నివాసం కార్యకర్తలతో కిటకిట లాడిపోయింది. తండ్రిపై తిరుగుబాటు చేయాల్సిందేనని వారు అఖిలేష్ పై వత్తిడి కూడా తెస్తున్నారు. సీఎం అభ్యర్ధి ఎవరో ఎన్నిక తర్వాత తేలుస్తామని ములాయం చెప్పడం కూడా వారి ఆగ్రహానికి కారణమయింది. మొత్తం మీద ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందే ఎస్పీ చీలిక వచ్చే అవకాశమున్నట్లు కన్పిస్తుంది.

Similar News