పందెం కోడికి పగ్గాలు

Update: 2016-12-26 07:13 GMT

సంక్రాంతికి పందెరాయుళ్లకు హైకోర్టు షాకిచ్చింది. కోడిపందేలను నిషేధిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పందేల పేరుతో మూగజీవాలను హింసించడం తగదని న్యాయస్థానం పేర్కొంది. కోడిపందేల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

మూడు రోజుల్లో 30 వేలు

సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడిపందేలు జోరుగా జరుగుతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలు దీనికి ప్రసిద్ధి. సంక్రాంతి మూడు రోజులూ వేల కోట్లలో చేతులు మారతాయి. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ కోడిపందేలను జరుపుతుంటారు. ఒక్కొక్క కోడి వేల రూపాయలు పలుకుతుంది. సంక్రాంతి రోజుల్లో జరిగే కోడిపందేలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. సినిమా యాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు కూడా ఏదో ఒకరోజు వచ్చి కోడిపందేలను చూసి వెళ్లాల్సిందే. అలా ఉంటుంది కోడి పందేలకు గిరాకీ. ముఖ్యంగా భీమవరం ప్రాంతంలో లాడ్జిలన్నీ కూడా ఇప్పుడే అడ్వాన్స్ గా బుక్ అయి పోయాయి. అలా ఉంటుంది కోడి పందేల జోరు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అనేకమంది ఇక్కడికి వస్తుంటారు.

గత కొన్నేళ్లుగా కోడిపందేలను నిషేధించాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. కోర్టులనూ ఆశ్రయించారు. అయినా పందేలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు కూడా ఏం చేయలేక పోతున్నారు. బరి వద్ద మద్యం ఏరులై పారుతుంది. పండగ పేరుతో మూగ జీవాలను హింసించవద్దంటున్నా ఏటా అవి మాత్రం నిరాటంకంగానే జరుగుతున్నాయి. కోడిపందేలను జరగనివ్వకుంటే అక్కడి ప్రజాప్రతినిధుల పదవులు ఊడే ప్రమాదముండటంతో వారు కూడా పందేలకు సై అంటున్నారు. దీంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. పండగ మూడు రోజుల్లో దాదాపు 30 వేల కోళ్లు రక్తం చిందిస్తాయి. చచ్చిన కోడికి కూడా డిమాండ్ అలానే ఉంటుంది. తాజాగా హైకోర్టు పందేలకు బ్రేక్ వేయడంతో పందెంరాయుళ్లు ఏం చేస్తారో చూడాలి మరి.

ప్రజాప్రతినిధుల మద్దతు కోడికా....కోర్టుకా??...

Similar News