ఫ్యామిలీ హై డ్రామా, తండ్రికి తనయుడి సవాల్

Update: 2017-01-01 09:22 GMT

ములాయం సింగ్ ఫ్యామిలో మళ్లీ సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అఖిలేష్ తండ్రికి చెక్ పెట్టేశారు. సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ నియామకం జరిగిపోయింది. లక్నోలో జరిగిన జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశంలో తండ్రిని పదవి నుంచి తప్పించి సలహాదారుగానే నియమించారు. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ ను తొలగించారు. ఆయనస్థానంలో రాంగోపాల్ యాదవ్ ను నియమించారు.అమర్ సింగ్ ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ చర్యల ద్వారా తండ్రికి సవాల్ విసిరారు. బాబాయి శివపాల్ యాదవ్ పై అఖిలేష్ మండిపడ్డారు. అఖిలేష్ సమావేశానికి 200 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. దాదాపు ఐదు వేలమంది కార్యకర్తలు హాజరైన ఈ సమావేశంలో రాంగోపాల్ యాదవ్, శివపాల్ పై మండిపడ్డారు. పార్టీని శివపాల్ భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. అఖిలేష్ మాత్రం తండ్రికి తాను ఎప్పటికీ విధేయుడనేనని ప్రకటించుకున్నారు.

రాంగోపాల్ సస్పెన్షన్

అఖిలేష్ సమావేశంలో నిర్ణయాలు వెలువడిన వెంటనే పెద్దాయనకు కోపం కట్టలు తెంచుకుంది. వారెవరు నన్ను పదవి నుంచి తప్పించడానికని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంగోపాల్ యాదవ్ ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. నిన్న టీకప్పులో తుఫాను లా చల్లారని కుటుంబ కలహాలు తెల్లారేసరికి మళ్లీ మొదటికొచ్చాయి. లాలూ నెరిపిన దౌత్యం కూడా ఫలించలేదు. అఖిలేష్ ప్రభుత్వంలోనే కాకుండా పార్టీపైన పట్టునింపుకోవడానికే ఈ ప్రయత్నం చేశాడంటున్నారు. మొత్తం మీద ములాయం ఫ్యామిలీ డ్రామా యూపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతోందో వేచిచూడాలి.

Similar News