మంత్రి గంటా రూ.200 కోట్లు ఎగ్గొట్టారా?

Update: 2016-12-30 05:53 GMT

బ్యాంకుల నుంచి రుణం తీసుకుని బకాయిలు చెల్లించకుండా ఎగవేసిన జాబితాలో మరో మంత్రివర్యులు చేరారు. విశాఖ కు చెందిన ఈ అమాత్యులు వారి అనుచరులు కలసి ఏకంగా బ్యాంకుకు 200 కోట్ల రుపాయల బాకీయి పడ్డారు. దీంతో కంపెనీ పేరిట హమీదారులు అయిన అమాత్యుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకు సిద్దమైంది. విశాఖ కు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి దాదాపు గా 200 కోట్ల రుపాయలు రుణాన్ని తీసుకుంది. ఈ రుణానికి హామీదారుగా రాష్ట్ర మానవ వనరుల శాఖ మాత్యులు గంటా శ్రీనివాసరావు వ్యవహారిస్తున్నారు. మెస్సర్స్ ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ అనే కంపెనీ లో పరుచూరి రాజారావు, పరుచూరి వెంకయ్య ప్రభకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావు డైరెక్టర్లుగా వ్యవహారిస్తున్నారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు, కొండయ్య బాల సుభ్రహ్మణ్యం, నార్ని అమూల్యలు హామీదారులుగా ఉన్నారు. ఈ ప్రత్యూష కంపెనీ డాబాగార్డెన్స్ లోని శారద వీధి లో వున్న ఇండియన్ బ్యాంక్ లో ఈ కంపెనీ లావాదేవీల కోసం రూ. 141 కోట్లు రుణం తీసుకుంది. అయితే సదరు బ్యాంకు బకాయిలను చెల్లించాలని గత అక్టోబర్ 4న డిమాండ్ నోటీస్ జారీ చేసింది. నోటీసు అందిన 60 రోజుల్లోగా రుణ బకాయి చెల్లించాలని లేకుంటే ఆస్తులు స్వాదీనం చేసుకుంటామని నోటీస్ లో పేర్కోంది. ఈనెల 13వ తేది నాటికి వడ్డీతో కలిపి రూ. 196 కోట్లు బకాయి ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది.

రుణం తీసుకున్న కంపెనీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు సమాయత్తం అయింది. అయితే ఇందులో కంపెనీకి సంభందించిన ఆస్తులతో పాటు హమీదారులైన మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతరులకు స్వాదీన నోటీసులు పంపినట్లు సమాచారం . మెుత్తం వివిధ ప్రాంతాల్లోనున్న 26 ఆస్తులను స్వాదీనం చేసుకునేందుకు బ్యాంకు అధికారులు సిద్దమవుతున్నారు. ఈ ఆస్తుల జాబితాలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటితో సహా ,బాలయ్యశాస్త్రీ లేఅవుట్ లో వున్న సర్వే నెం. 20పీ లోని ప్లాట్ నెం ఏ12 లోని 444 చ.గ వీస్తీర్ణం లో నిర్మాణంలో వున్న ఆస్తి తో పాటు, గాజువాక లో కుర్మన్నపాలెం లో 1146 చ.గ స్థలం, అనకాపల్లి పూడిమాడక జంక్షన్ లో 0.6766 ఎకరాల భూమి, చోడవరం లో 1355 చ.గ స్థలం, విశాఖ ఎంవీపీ కాలనీలో గంటా శ్రీనివాసరావు పేరిట కలిగిన నివాసభవనం తో పాటు మరికొన్ని ఆస్తుల జాబితా కూడా బ్యాంకు అధికారుల జాబితాలో వుంది. అయితే దీని పై అమాత్యులు మాత్రం స్పందించడం లేదు. ప్రత్యూష కంపెనీ ఆస్తులతో పాటు డైరెక్టర్ల ఆస్తులు పై మాత్రమే బ్యాంకు నిబందనల ప్రకారం వ్యవహరిస్తుందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు విశాఖ లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా కూడా వేడెక్కుతుంది. మెుత్తం మీద ప్రత్యూష కంపెనీ వ్యవహారం మంత్రి గంటా కు మింగుడుపడనీయకుండా చేస్తుంది.

Similar News