తెలంగాణ రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం లేదా? కేవలం త్రిముఖ పోటీనే ఉంటుందా? ఇక్కడ పొలిటికల్ స్పేస్ లేదని తేల్చి చెప్పేశారు ప్రొఫెసర్ కోదండరామ్. తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు పార్టీ పెడితే గెలవరని ఆయన చెప్పేశారు. తాను కొత్తగా పార్టీ కూడా పెట్టబోవడం లేదని చెప్పారు. కులాల పేరుతో పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో కుదరవన్నారు. వాస్తవానికి కోదండరామ్ కొత్త పార్టీ పెడుతున్నారని కొన్నాళ్ల నుంచి టాక్ ఉంది. మీడియాలో కూడా అడపా...దడపా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్ కి ప్రొఫెసర్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాను నిరంతరం ప్రజాసమస్యలపైనే పోరాడుతుంటానని తేల్చి చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలను మాత్రం పెద్దాయన కొనసాగించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాల్సిందేనన్నారు కోదండరామ్. సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని నడుపుకునేందుకు రైతులు ముందుకొచ్చారని మరి దానిసంగతేమిటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు.