వీడియోగ్రాఫర్ నుంచి ముఖ్యమంత్రి వరకూ

Update: 2017-02-05 14:13 GMT

ఒక వీడియోగ్రాఫర్ నుంచి ముఖ్యమంత్రి పదవి వరకూ శశికళ ప్రస్థానం జరిగింది. సామాన్య మహిళ నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వచ్చారు శశికళ. అమ్మ జయలలిత కొంగు చాటున రాష్ట్రాన్ని ఇప్పటి వరకూ నడిపిన చిన్నమ్మ ఇక ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చారు. 25ఏళ్ల చిన్నమ్మ కృషి...సంకల్పం నేడు ఫలించింది. అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసి చూపించింది.

జయకు నెచ్చలిగా....

శశికళకు జయలలితకు 1991లో పరిచయం ఏర్పడింది. ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత ప్రచార కార్యదర్శిగా ఉండేవారు. శశికళ వీడియో క్యాసెట్ల దుకాణం నడిపేది. ప్రచార కార్యక్రమాలకు సంబంధంచి వీడియోను షూట్ చేసి శశికళ జయకు స్వయంగా వచ్చి చూపేవారు. దీంతో జయ, శశికళ సంబంధం బలపడింది. ఇది ఎంతవరకూ వచ్చిందంటే...శశికళ కుటుంబం మొత్తం పోయెస్ గార్డెన్ కు చేరుకునేలా.. ఇక జయలలిత కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత శశికళ పైనే ఎక్కువ ఆధారపడేది. తొలుత వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమైన చిన్నమ్మ చిన్నగా రాజకీయ సలహాలు కూడా ఇవ్వడం మొదలెట్టారు. చివరకు ఎమ్మెల్యే అభ్యర్ధులను, మంత్రులను నిర్ణయించే స్థాయికి శశికళ ఎదిగారు. చిన్నగా చిన్నమ్మ పార్టీపైనా పట్టు సాధించారు. జయకు తోడుగా ఉంటూనే తనకంటూ సొంత మనుషులను ఆమె నియమించుకున్నారని చెబుతారు.

భర్త అండతో....

శశికళది సొంతూరు తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని మన్నార్ గుడి. సాధారణ గృహిణిగా ఉండే మహిళ రెండు మూడు రోజుల్లో తమిళనాడుకు సీఎం కాబోతున్నారు. గత కొన్ని రోజులుగా శశికళ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. పన్నీర్ సెల్వం ను తప్పించేందుకు పోయెస్ గార్డెన్ నుంచే పావులు కదిపారు. తొలుత అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టిన శశి తర్వాత సీఎం కుర్చీపై మనుసు పడింది. తాను సులువుగా సీఎం పీఠం ఎక్కేందుకు మార్గాన్ని సృష్టించుకోవడానికి శశికి ఎన్నో రోజులు పట్టలేదు. రబ్బర్ స్టాంప్ గా ముద్రపడ్డ పన్నీర్ సెల్వాన్ని తప్పించడానికి పెద్దగా కష్టపడలేదామె. శశికళ భర్త నటరాజన్, డిప్యూటీ స్పీకర్ తంబిదురై చిన్నమ్మను సీఎం చేయడంలో తీవ్రంగా కృషి చేశారు. మొత్తం మీద తమిళనాడుకు మూడో మహిళగా శశికళ సీఎం పీఠాన్ని అధిష్టించనున్నారు.

Similar News