సర్కార్ వైఫల్యాలపై టీజేఏసీ ఉద్యమ కార్యాచరణ

Update: 2016-12-25 13:44 GMT

తెలంగాణ ప్రభుతంపై టీజేఏసీ నిప్పులు చెరిగింది. ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదంటూనే సర్కారుపై దాడికి దిగింది. టీజేసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కోదండరామ్ కార్యాచరణనూ సిద్ధం చేసుకున్నారు. జోనల్ వ్యవస్థ రద్దు అన్యాయమని జేఏసీ అభిప్రాయపడింది. భూసేకరణ బిల్లును ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేసింది. ఇందుకోసం ఈ నెల 29 వతేదీన హైదరాబాద్ లో మహాధర్నా చేయాలని టీజేఏసీ నిర్ణయించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పనులను వచ్చే ఏడాది మార్చిలో క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిశీలించాలని నిశ్చయించింది. నిజాం షుగర్స్ పై సీఎం ప్రకటన అసంబద్దమని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. నిజాం షుగర్స్ ను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. నిజాం షుగర్స్ తెరవాలని కోరుతూ త్వరలో పాదయాత్ర చేపడతామన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, స్పీకర్ హుందాతనాన్ని కాపాడుకోవాలని కూడా కోదండరామ్ సూచించారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్ధులు, ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ త్వరలో హైదరాబాద్ ధర్నా నిర్వహించనున్నామని కోదండరామ్ తెలిపారు. కేబినెట్ లో మహిళలకు స్థానం కల్పించాలని కూడా ప్రొఫెసర్ సూచించారు. రాజకీయ నేతలను లోకాయుక్త పరిధిలోకి తీసుకురావాలన్న కోదండరామ్ తమలో ఎవరు సీఎం అయినా జేఏసీ ఇలాగే ఉంటుందని చెప్పడం విశేషం. రైతు రుణమాఫీని ఏకకాలం చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా టీజేఏసీ స్పష్టమైన ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంది.

Similar News