తమిళనాడు మాజీ ఛీఫ్ సెక్రటరీ రామ్మోహనరావు డైరీ ఇప్పడు కలకలం రేపుతోంది. తమిళనాట ఇదే హాట్ టాపిక్. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. కిలోల కొద్దీ బంగారం, కట్టల కొద్దీ కరెన్సీ నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఆయన స్వదస్తూరితో రాసిన డైరీ కూడా ఐటి అధికారుల చేతికి చిక్కింది. దీంతో తమిళనాడులో ఐఏఎస్ అధికారులు వణికిపోతున్నారు.
డైరీతో దడ...దడ
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహనరావుకు ఛాతీ నొప్పి రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన రాసుకున్న డైరీలో ఎవరి పేర్లు ఉన్నాయోనన్న ఉత్కంఠ తమిళనాట ఉంది. డైరీలో పలువురు ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల పేర్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా రామ్మోహన్ కు సన్నిహితంగా ఉండే ఐదుగురు ఐఏఎస్ అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు శశికళ బంధువుల పేర్లు కూడా డైరీలో చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురి కాంట్రాక్టర్లు పేర్లు చోటుచేసుకోవడంతో వీరంతా ఇప్పడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎప్పుడు ఐటీ దాడులు తమ ఇంటిపై జరుగుతాయోనన్న బెంగతో ఉన్నారు. మొత్తం సీఎస్ డైరీ మూడు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.