పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటతప్పారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన రైతు మహాధర్నాలో జగన్ బాబు తీరును ఎండగట్టారు. పులివెందుల బ్రాంచి కెనాల్ కు నీటి విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం తప్ప చంద్రబాబు అభివృద్ధి పనులకు నిధులు ఎక్కడ కేటాయించారని ప్రశ్నించారు. శ్రీశైలం, చిత్రావతిలో నీళ్లున్నా పులివెందులకు నీళ్లు ఎందుకివ్వడం లేదన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లిస్తానని చంద్రబాబు డప్పాలు కొట్టారని, ఇంతవరకు రాయలసీమకు నీరు ఎందుకు విడుదల చేయలేదన్నారు. పట్టిసీమపై పెట్టిన ఖర్చుతో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయవచ్చని, దానివల్ల కడప జిల్లా సస్యశ్యామలమయ్యేదన్నారు. గండికోట, గాలేరి-నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే కడప జిల్లాకు 22 వేల క్యూసెక్కుల నీరు వచ్చిఉండేదన్నారు.