Ys Jagan : విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపై జగన్ ఏమన్నారంటే?

వైసీపీ అధినేత జగన్ మరోసారి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-11-28 12:03 GMT

వైసీపీ అధినేత జగన్ మరోసారి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం అంటే ఇదా అని ఆయన ప్రశ్నించారు. మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ తమ హయాంలో వేగంగా పోర్టుల నిర్మాణం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. మూడు పోర్టుల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు. దీనివల్ల అదనపు ఆదాయం పెరగడమే కాకుండా, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మెడికల్ కళాశాలల వల్ల కూడా సంపద పెరగడమే కాకుండా వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. తమ హయాంలో చేపట్టిన కార్యక్రమాలను తప్పుపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. తాము ఐదేళ్ల పాటు ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నించామని చెప్పారు. ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని వాలంటీర్ల ద్వారా అందచేశామని చెప్పారు.

మరోసారి చంద్రబాబు సర్కార్ పై
విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపైన కూడా జగన్ స్పందించారు. తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఒప్పందం జరిగింది కేవలం కేంద్ర ప్రభుత్వసంస్థ అయిన సెకీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని ఆయన అన్నారు. అత్యంత చవకగా విద్యుత్తును కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. అయినా సరే తమపై బురద జల్లడమేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చేసుకున్న సోలార్ ఒప్పందాల కారణంగా 5.90 రూపాయలు యూనిట్ కు చెల్లించాల్సి వచ్చిందని, దీనివల్ల ప్రజలకు నష్టమని ఆయన తెలిపారు. తాము చేసిన ప్రయత్నం వల్లనే నాణ్యమైన విద్యుత్తును 9 గంటల పాటు అందివ్వగలిగామని చెప్పారు. చంద్రబాబు అబద్దాలు చెబుతూ ఎంతో కాలం అధికారంలో ఉండలేరన్న జగన్ ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని తెలిపారు.


Tags:    

Similar News