Pawan Kalyan : లోకేశ్ కు పవన్ అలా చెక్ పెడుతున్నారా? స్ట్రాటజీ అదేనా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యూహం ప్రకారం రాజకీయంగా అడుగులు వేస్తున్నట్లు కనపడుతుంది;

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యూహం అదేనా? పదే పదే చంద్రబాబు నాయుడును పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడం వెనక కారణమేమై ఉంటుందన్న దానిపై ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఒక స్ట్రాటజీ ప్రకారమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ముందుచూపుతోనే ఈ కామెంట్స్ తరచూ చేయడం వెనక కూడా దూరదృష్టి ఉందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని పవన్ కల్యాణ్ చెబుతుంటే భవిష్యత్ లో తనకు టీడీపీ అనుకూలురు మద్దతు కూడా లభిస్తుందన్న కారణంతోనే చంద్రబాబు పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని పదే పదే కోరుతున్నారని చెబుతున్నారు.
కొందరికి ఇబ్బందికరమైనా?
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఒక రకంగా టీడీపీ శ్రేణులకు, నేతలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు తమ అధినేత అయినప్పటికీ వారంతా నారా లోకేశ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నారా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్ ఇటీవల కాలంలో ఊపందుకుంది. చిన్న స్థాయి నేతల నుంచి సీనియర్ నేతల వరకూ నారా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని అంటున్నారు. అయితే అందుకు జనసేన క్యాడర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేశ్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వడమేంటని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
పదే పదే పొగడటంతో...
అయితే చంద్రబాబును పదే పదే పొగడటంతో పాటు ఆయనే పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం వెనక కూడా పవన్ కల్యాణ్ వ్యూహమేనంటున్నారు. తన వ్యాఖ్యలతో నారా లోకేశ్ డిప్యూటీ సీఎం పదవికి చెక్ పెట్టడమే కాకుండా, దరిదాపుల సమయంలో నారా లోకేశ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించకూడదనే పవన్ కల్యాణ్ ఇలా చంద్రబాబును సీఎంగా కొనసాగాలంటున్నారన్న రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. దీనివల్ల టీడీపీ సానుభూతి పరులతో పాటు ఆ ఓటు బ్యాంకు కూడా తనకు భవిష్యత్ లో అండగా నిలుస్తుందన్న భావన ఆయనలో ఉందన్నారు. అందుకే చంద్రబాబు నాయుడుప పదిహేనేళ్ల సీఎం అంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ పవన్ టీడీపీలో కొందరి మైండ్స్ ను బ్లాంక్ చేస్తున్నారంటున్నారు.
చంద్రబాబు హ్యాపీ...
చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు ఖుషీ అవుతున్నారు. తనకు అండగా పవన్ కల్యాణ్ ఉంటారన్న నమ్మకంతో ఆయన జనసేనకు కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో నేతలు అక్కడకక్కడా ఇబ్బంది పెట్టినా పవన్ కల్యాణ్ అండ తనకు అవసరమని భావిస్తున్న చంద్రబాబు పవన్ కల్యాణ్ విషయంలోనూ భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో పాటు బీజేపీని కూడా టీడీపీతో కలసి ప్రయాణం చేసేందుకు పవన్ కల్యాణ్ ఉపయోగపడతారని, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వీలవుతుందన్న అంచనాల్లో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.