Anna Datha Sukhibhava : అన్నదాత సుఖీభవ నిధులు ఏప్రిల్ లో కాదా? మళ్లీ వాయిదానేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరసగా అమలు చేస్తూ వస్తుంది;

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను వరసగా అమలు చేస్తూ వస్తుంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలోఅమలు చేస్తామని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను జమ చేస్తామని చంద్రబాబు చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల కు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఏడాదికి ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. మ్యానిఫేస్టోలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి రైతుకు ఏడాదికి ఐదు వేల రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు తొమ్మిది నెలలయినా అమలు చేయకపోవడంపై రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో...
అయితే తాజాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే చర్చలో ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని తెలిపారు. అంతకు ముందు శాసనమండలిలో మంత్రి నారా లోకేశ్ ఈ పథకాన్ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తామని చెప్పారు. కానీ చంద్రబాబు ప్రసంగం విన్న తర్వాత జూన్, జులై నాటికి కాని ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి ఏడాదికి ఇరవై వేలు చెల్లిస్తామని తెలిపారు. మూడు విడతలుగా తాము కూడా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే నిధులు జమ చేస్తామని చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం దానికి పథ్నాలుగు వేల రూపాయలు కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.
ఖరీఫ్ సీజన్ లోనేనా?
కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ నెల 24వ తేదీన 19వ విడత పీఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. అంటే మరో విడత నిధులను జూన్ లేదా జులైలో విడుదల చేస్తుంది. ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయలేకపోయినందున తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు కనపడుతుంది. ఎందుకంటే కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలతో పాటు మరో నాలుగు వేల రూపాయలు కలిపి జూన్ లేదా జులై లో ఇచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అంటే వచ్చే ఖరీఫ్ సీజన్ లో ఈ పథకం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.