మోదీకి ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన జగన్
ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. అరగంట సేపు ప్రధానితో బేటీ అయ్యారు.;
ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. అరగంట సేపు ప్రధానితో బేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై జగన్ మోదీతో చర్చించారు. దాదాపు 45 నిమిషాల సేపు ప్రధానితో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడంలో ఆలస్యం చేయవద్దని కోరారు. పోలవరం రీఎంబర్స్ మెంట్ నిధులను గురించి కూడా జగన్ ప్రస్తావించారు. కడప స్టీల్ ప్లాంట్ కు సంబంధించి బొగ్గు గనుల కేటాయింపుపై కూడా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆరు వేల కోట్ల విద్యుత్తు బకాయిల విషయాన్ని కూడా జగన్ ప్రధాని ఎదుట ప్రస్తావించారు.
రాష్ట్రపతి ఎన్నికకు...
తర్వాత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్ కు ప్రధాని మోదీకి క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. గతంలో తాము మద్దతు ఇచ్చామని, అలాగే ఈసారి కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే 2024 ఎన్నికల దృష్ట్యా ఈసారి కూడా అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణాలను పాటించాలని ఆయన కోరినట్లు సమాచారం. అప్పుడే మద్దతు ఇచ్చేందుకు అన్ని పార్టీలూ ముందుకు వస్తాయని కూడా జగన్ ప్రధానికి వివరించినట్లు తెలిసింది.
నిర్మలా సీతారామన్....
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన 17 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. నిధుల సమీకరణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకర్లను ఆదేశించాలని జగన్ నిర్మలా సీతారామన్ ను కోరినట్లు తెలిసింది.