17న రైతు భరోసా రెండో విడత
ఈ నెల 17న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.;
ఈ నెల 17న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అలాగే నవంబరు నెల నుంచి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. నవంబరు మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోలు జరపాలని జగన్ నిర్ణయించారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
భూసార పరీక్షలను..
పౌరసరఫరాల శాఖ సమీక్షలో జగన్ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రంగు మారిన, బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలని ఆయన అధికారులను సూచించారు. పొగాకు రైతులకు నష్టం కలగకూడదని తెలిపారు. వారికి మద్దతు ధర సరిగా లభించేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సరైన ధర లభించకపోతే సీఎం యాప్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకుంటామని జగన్ వివరించారు. మార్చి నుంచి మే నెల వరకూ భూసార పరీక్షలు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. భూసార పరీక్షల కోసం ముంబయి ఐఐటీ, కాన్పూర్ ఐఐటీలోని కొన్ని అంశాలను పరిశీలించామని చెప్పారు. ఖరీఫ్ పంటకు ముందే భూసార పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.