బైక్ పైనే కొడుకు మృతదేహం తరలింపు : ప్రభుత్వ తీరుపై నారా లోకేష్ ఫైర్

ఎవరూ సహాయం చెయ్యని దయనీయ పరిస్థితిలో బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృత దేహాన్ని తరలించాడు ఆ తండ్రి. పబ్లిసిటీ పిచ్చితో మీరు..

Update: 2022-05-05 05:27 GMT

నెల్లూరు : తిరుపతిలోని రుయా ఆస్పత్రి తరహా ఘటన తాజాగా నెల్లూరులో జరగడంపై టిడిపి నేత నారా లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేస్తూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అంబులెన్స్ నిర్వహణ మీ ఏ2 సాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు.

" రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూసాం. విశాఖ కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో ఒక కుటుంబం పై తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూసి షాక్ అయ్యాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం కోసం రూ.15 వేలు డిమాండ్ చేశారు సిబ్బంది. రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా వైసిపి ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదు. నెల్లూరు జిల్లా సంఘంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బిడ్డని కోల్పోయిన బాధలో ఉన్న తండ్రి అంబులెన్స్ ఏర్పాటు చెయ్యాలని వేడుకున్నా ఆస్పత్రి సిబ్బంది మానవత్వంతో స్పందించకపోవడం దారుణం.
ఎవరూ సహాయం చెయ్యని దయనీయ పరిస్థితిలో బైక్ పైనే కొడుకు శ్రీరామ్ మృత దేహాన్ని తరలించాడు ఆ తండ్రి. పబ్లిసిటీ పిచ్చితో మీరు జెండా ఊపిన వాహనాలు అన్నీ ఎక్కడికి పోయాయి జగన్ రెడ్డి గారు? సిబ్బంది, కనీస సౌకర్యాల లేమితో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంబులెన్స్ నిర్వహణ మీ ఏ2 సాయిరెడ్డి అల్లుడికి కట్టబెట్టాకే ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా? " అని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికార యంత్రాంగం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.


Tags:    

Similar News