YSRCP : బందరు.. వయా గన్నవరం.. చిలకలూరిపేట టు నెల్లూరు... తర్వాత... చిత్తూరేనా?
వైసీపీ నేతలపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. వీరిని ఎప్పుడైన అరెస్ట్ చేసే అవకాశముందని తెలిసింది.;

వైసీపీ నేతలపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. గత ప్రభుత్వంపై జరిగిన అక్రమాలను బయటకు తీస్తూ ముఖ్యనేతలపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తొలుత రేషన్ బియ్యం కేసులో మచిలీపట్నానికి చెందిన పేర్ని నానితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన న్యాయస్థానానికి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. రేషన్ గోదాములో బియ్యం మాయమయిన ఘటనలో పేర్ని నాని కోటిన్నరకు పైగా ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు ఆయన కూడా నిందితుడిగా ఉన్నారు. పేర్ని నాని మచిలీపట్నంలోని తన రైస్ మిల్లులో దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసింది.
వంశీని అరెస్ట్ చేసి...
నాని తర్వాత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారన్న కారణంగా ఆయనను అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజులకు పైగానే ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వరసగా కేసులు నమోదు అవుతుండటంతో వంశీ ఇప్పట్లో బెయిల్ పై బయటకు వస్తారన్న నమ్మకం కూడా లేదు. అంతకు ముందు బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను కూడా పలు కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే నందిగం సురేష్ మాత్రం కొద్ది రోజుల క్రితం జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చారు.
పోసాని నెల రోజుల పాటు...
ఇక గత ప్రభుత్వ హయాంలో ఫిలిం ఫెడరేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారంటూ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేసిన పోలీసులు పోసానిని గత నెల 21వ తేదీన అరెస్ట్ చేశారు. పోసానిపై పదిహేడు కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో ముందస్తు బెయిల్, మరికొన్నింటిలో షరతులతో కూడిన బెయిల్ తీసుకుని పోసాని రెండు రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై నమోదయిన కేసులు ఇప్పుడు కోర్టుల్లో నడుస్తున్నాయి. ఇక మాజీ మంత్రి విడదల రజనీపై కూడా తాజాగా ఏసీబీ కేసు నమోదయింది. ఆమె స్టోన్ క్రషర్ యజమాని నుంచి 2.26 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ ఫిర్యాదు అందడంతో రజనీతో పాటు మరికొందరిపై కేసు నమోదయింది. ఎప్పుడైనా విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలున్నాయంటున్నారు.
కాకాణి తర్వాత...?
తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో లీజు సమయం ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదయింది. గనుల శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఏ4గా కాకాణి గోవర్ధన్‌రెడ్డి 120బీ, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక నెల్లూరు నుంచి చిత్తూరు వెళ్లడమే తరువాయి అంటున్నారు. అక్కడ ఇప్పటికే కీలక నేతలపై మద్యంతోపాటు పలు కేసులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద వరస కేసులతో వైసీపీ నేతల్లో దడ మొదలయిందనే చెప్పాలి. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారన్న ఉత్కంఠ నెలకొంది.