MLC Elections : రెండూ కూటమికే.. మరి అభ్యర్థులు ఎవరు.. మూడు పార్టీల్లో హాట్ టాపిక్

ఆంధ్రప్రదేశ్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలయింది.

Update: 2024-06-18 12:22 GMT

ఆంధ్రప్రదేశ్ లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలయింది. ఈ నెల 25వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు జులై 2వ తేదీ తుది గడువుగా పేర్కొంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 2వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. దీంతో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టులు ఎవరికి దక్కుతాయన్న చర్చ మొదలయింది. ఎమ్మెల్యేల కోటా కింద ఈ ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సి. రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ పై అనర్హత వేటు వేయడంతో దీనికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మళ్లీ వారికేనా?
ఎమ్మెల్యే కోటా ఎన్నికలు కావడంతో రెండు స్థానాలు కూటమి పార్టీలకే చెందుతాయి. బలాబలాలను పరిశీలిస్తే వైసీపీ పోటీ చేేసే అవకాశం కూడా లేదు. 164 స్థానాలతో గెలిచిన కూటమి పార్టీలకే రెండుస్థానాలు దక్కుతాయి. అయితే అనర్హత వేటు పడిన వారిద్దరికీ తిరిగి అవాకాశమిస్తారా? లేదా కొత్త వారికి చోటు కల్పించనున్నారా? అన్నది మాత్రం కూటమి నేతలు నిర్ణయించాల్సి ఉంది. సి. రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్ లు ఇద్దరూ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరడంతో ఇద్దరిపైనా అనర్హత వేటు పడింది. ఇద్దరు వేర్వేరు సామాజికవర్గాల వారు కావడంతో వారికే తిరిగి అవకాశమిచ్చి ఎన్నికల సమయంలో తమకు అండగా నిలిచినందుకు వారి పదవులను వారికే ఇస్తారా? అన్నది తేలనుంది.
కొత్త వారికా?
మరోవైపు కొత్త వారిని ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోలేదు. వారిద్దరూ రాయలసీమకు చెందిన నేతలు కావడంతో మారుస్తారని అధికార తెలుగుదేశం పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. కూటమి అభ్యర్థుల కోసం కష్టపడిన అనేకమంది నేతలు వెయిటింగ్ లో ఉండటంతో వారికి అవకాశం కల్పించే వాదనను కూడా కొట్టిపారేయలేమంటున్నారు నేతలు. అనేక మంది నేతలు కూటమి గా ఏర్పడటంతో తమకు దక్కాల్సిన సీట్లను త్యాగం చేశారని, వారికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో పాటు సి. రామచంద్రయ్య స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధాకు ఇస్తారన్న ప్రచారం కూడా ఉంది. మహ్మద్ ఇక్బాల్ ను కూడా పక్కన పెట్టి జనసేనకు చెందిన నేతకు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు బీజేపీ కూడా తమ పార్టీకి ఒకటివ్వాలని కోరుతుంది. మొత్తం మీద కూటమి పార్టీలకు చెందిన అగ్రనేతలు కూర్చుని దీనిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.


Tags:    

Similar News