Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు గుడ్ న్యూస్
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్కు 1650 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ప్రకటించడమే కాదు. సాయాన్ని అందించింది కూడా. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరిస్తుందని గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సాయం అందడం ఒకరకంగా శుభవార్తగానే చూడాలి. ఎందుకంటే ప్రయివేటీకరణ చేసే ముందు ఇంత పెద్దయెత్తున నిధులను అందచేయదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
భారీగా నిధులను...
విశాఖలోని స్టీల్ ప్లాంట్ పరిశ్రమను ప్రయివేటీకరణ చేయవద్దని, ప్రయివేటు సంస్థలకు అప్పగించవద్దని, ఇది తమ సెంటిమెంట్ అంటూ అన్ని రాజకీయ పార్టీలూ ముక్త కంఠంతో చెబుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ నిమిత్తం 1,650 కోట్ల రూపాయలు సాయం అందించడమంటే మాటలు కాదు. సంస్థ కార్యకలాపాలు యధాతధంగా కొనసాగేందుకు ఈ నిధులు వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా సెప్టంబరు 19న ఈక్విటీ కింద ఐదు వంద కోట్ల రూపాయలు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద 1,150 కోట్ల రూపాయలు అందించిందంటే సంస్థ సుస్థిరంగా కొనసాగేందుకే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో దీనిపై నివేదికను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.