Chandrababu : షర్మిల చేత నాడు పాదయాత్ర చేయించింది నేనా?
వైఎస్ షర్మిలను కాంగ్రెస్ లో కి తాను పంపానని వైసీపీ చేసిన విమర్శలపై చంద్రబాబు స్పందించారు. ఆచంట సభలో ఆయన ప్రసంగించారు;
వాళ్ల కుటుంబంలో సమస్యలకు తాను కారణమని జగన్ అబద్దాలు ఆడుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆచంటలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రకటించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లడానికి తానే కారణమని చెబుతున్నారన్నారు. అంతకంటే అబద్దం మరొకటి ఉంటుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది రిలయన్స్ అని ఆరోపించిన వైసీపీ నేతలు అదే రిలయన్స్ అధినేత అంబానీ మిత్రుడు నత్వానీకి రాజ్యసభ ఇచ్చింది నిజంకాదా? అని నిలదీశారు. జగన్ కుటుంబంలో విభేదాలకు తాను కారణం ఎలా అవుతానని అన్నారు. వారి ఇంట్లో విభేదాలు జగన్ సృష్టించుకున్నవేనని చంద్రబాబు అన్నారు. జగనన్న వదిలిన బాణం ఆయనవైపే తిరిగిందని అన్నారు.
జగన్ సినిమా అయిపోయింది...
టీడీపీ, జనసేన ప్రభుత్వంలో రైతు సంక్షేమాన్ని తీసుకు వస్తామని చెప్పారు. రైతులకు మేలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వమని అన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. పోలవరం పూర్తి చేసి ప్రజల చిరకాల కోరికను తాము నెరవేరుస్తామని చెప్పారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో? జగన్ మాటల్లో విశ్వసనీయత అంత ఉంటుందని అన్నారు. అమరావతిని రాజధానిగా తాము కొనసాగిస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టీడీపీ, జనసేన జైత్రయాత్ర ప్రారంభమవుతుందని చంద్రబాబు అన్నారు. జగన్ సినిమా ఇక అయిపోయినట్లేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
అందరికీ వర్క్ ఫ్రం హోం...
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం టీడీపీ అని మాత్రమేనని ఆయన అన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించారు. మూడు సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందచేస్తామని తెలిపారు. రైతులకు ఇరవై వేల రూపాయలు సాయం చేస్తామని అన్నారు. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో ఇస్తామని ప్రకటించారు. అందరికీ వర్క్ ఫ్రం హోం చేసుకునే అవకాశం కల్పిస్తానని తెలిపారు. ఏపీని ప్రపంచంతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఆదాయాన్ని సంపాదించే మార్గాన్ని టీడీపీ చూపిస్తుందని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు సబ్ ప్లాన్ తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.